Home పాలిటిక్స్ తవ్వేకొద్దీ అప్పులు.. జీతం తీసుకోవడం లేదు: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

తవ్వేకొద్దీ అప్పులు.. జీతం తీసుకోవడం లేదు: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

0
తవ్వేకొద్దీ అప్పులు.. జీతం తీసుకోవడం లేదు: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

 

Nsnnews// గొల్లప్రోలు: భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన అనంతరం మాట్లాడారు.
‘‘శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నా. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నా. అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదు. రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి.గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదు. వందలకోట్ల రూపాయలతో రుషికొండలో ప్యాలెస్‌ కట్టుకున్నారు. అవే నిధులు ఉపయోగిస్తే కొంత అభివృద్ధి జరిగేది. నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదు. పర్యావరణ శాఖను బలోపేతం చేస్తాం. గోదావరి పారుతున్నా తాగునీటికి ఇబ్బందులున్నాయి. గతంలో జల్‌జీవన్‌ మిషన్‌ నిధులున్నా ఉపయోగించలేదు. కనీసం మ్యాచింగ్‌ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు. 
క్యాంపు ఆఫీస్‌లో మరమ్మతుల గురించి అధికారులు అడిగితే ప్రస్తుతానికి ఏమీ చేయొద్దని చెప్పా. అవసరమైతే కొత్త ఫర్నిచర్‌ నేనే తెచ్చుకుంటానని తెలిపాను. సచివాలయం నుంచి సిబ్బంది వచ్చి వేతనాలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు పెట్టమంటే నాకు మనస్కరించలేదు. జీతం తీసుకుని పనిచేద్దామనుకున్నా.. కానీ పంచాయతీరాజ్‌ శాఖలో నిధుల్లేవు. ఎన్ని వేలకోట్ల రూపాయల అప్పులు ఉన్నాయో తెలియడం లేదు. ఒక్కో విభాగం తవ్వే కొద్దీ లోపలికి వెళ్తూనే ఉంది. ఇవన్నీ సరిచేయాలి. శాఖ అప్పుల్లో ఉన్నప్పుడు నాలాంటివాడు జీతం తీసుకోవడం చాలా తప్పు అనిపించింది. అందుకే జీతం వదిలేస్తున్నాను అని చెప్పా. దేశం కోసం, నేల కోసం పనిచేస్తున్నానని తెలిపాను.
నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా యువతలో ప్రతిభను వెలికితీయాలి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసమే నేనున్నా. విజయయాత్రలు మాత్రమే చేయడానికి నేను సిద్ధంగా లేను. గెలిచినందుకు ఆనందం లేదు.. పనిచేసి మన్ననలు పొందితేనే ఆనందం. పిఠాపురాన్ని దేశంలో మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. కాలుష్యం లేని పరిశ్రమలు ఇక్కడికి రావాలి. విదేశాలకు వెళ్లే వారికి శిక్షణ ఇప్పించి పంపాలి. డబ్బులు వెనకేసుకోవాలనో, కొత్తగా పేరు రావాలనో నాకు లేదు. ప్రజల్లో నాకు సుస్థిర స్థానం కావాలి. అన్ని పనులూ చిటికెలో కావు.. కానీ అయ్యేలా పని చేస్తాం. పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత ఉంటే పింఛన్లు వస్తాయి. అద్భుతాలు చేస్తామని చెప్పట్లేదు.. ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుంది’’ అని పవన్‌ అన్నారు. 
Latest news,Telugu news,Politics , Andhra Pradesh,East Godavari ,Pawan Kalyan…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version