Nsnnews// జైనథ్ మండలం తరోడ(బి)లో ఆలయంలో ఇద్దరు దొంగలు చోరీ చేస్తుండగా గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి భారత్ – దక్షిణాఫ్రికా జట్ల నడుమ టీ 20 ప్రపంచ కప్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతుండటంతో అందరూ టీవీ చూస్తున్నారు. ఆట పూర్తయ్యేసరికి అర్ధరాత్రి 12 గంటలు సమీపిస్తోంది. ఆ సమయంలో ఇద్దరు దొంగలు తమ ద్విచక్ర వాహనంపై తరోడ గ్రామానికి చేరుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా శ్రీ కృష్ణ ఆలయంలోకి చొరబడి తాళం పగులగొట్టారు. దేవుడికి సంబంధించిన నగలు అపహరించేందుకు యత్నించారు. దొంగలు తాళం పగులగొట్టడంతో ఆలయం పక్కన ఉన్న వారికి శబ్దం వచ్చింది. వారు మేల్కొని అప్రమత్తమయ్యారు.
చోరీ చేస్తున్న దుండగులను చూసి గ్రామస్థులకు సమాచారం అందించడంతో ఒక్కొక్కరుగా అందరూ రావడంతో దొంగలు లోపల నుంచి గడియపెట్టుకున్నారు. వారి దగ్గర ఉన్న కత్తి, రాడ్డుతో దాడి చేసేందుకు ముందుకు రాగా గ్రామస్థులంతా రాళ్లతో దాడి చేశారు. దొంగల ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. దొంగలు తప్పించుకునే ఆస్కారం లేకపోవడంతో చేసేదేమీ లేక గ్రామస్థులకు లొంగిపోయారు. పట్టుకున్న ఇద్దరు దొంగల చేతులను తాళ్లతో కట్టేసిన తరోడ గ్రామస్థులు దొంగలకు దేహశుద్ధి చేశారు. రాత్రంతా ఆలయంలోనే ఉంచి ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో జైనథ్ పోలీసులకు అప్పగించారు. జిల్లా కేంద్రంలో పలు ఆసుపత్రుల్లో దొంగతనం చేశారని గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. వీరిని ఆదిలాబాద్‌కు చెందిన షేక్ అయాన్, షేక్ సమీర్‌లుగా గుర్తించారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు జైనథ్ ఎస్‌ఐ పురుషోత్తం తెలిపారు.
Latestnews, Telugunews, Zainath Mandal….