Nsnnews// ఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆహార, డెయిరీ బ్రాండ్‌గా అమూల్ నిలిచింది. బ్రిటన్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ తన వార్షిక నివేదిక ‘ఫుడ్ అండ్ డ్రింక్ 2024’లో ఇచ్చిన ర్యాంకుల ప్రకారం.. వరుసగా నాలుగో ఏడాదీ ప్రపంచంలోనే బలమైన డెయిరీ బ్రాండ్‌గా అమూల్ తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ జాబితాలో అత్యంత విలువైన, బలమైన ఆహార, డెయిరీ, ఆల్కహాలేతర పానీయాల బ్రాండ్లకు ర్యాంకులు ఇచ్చారు. దీని ప్రకారం..
2023లో ఉన్న రెండో ర్యాంకు నుంచి 2024లో ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆహార బ్రాండ్లలో అగ్రస్థానానికి అమూల్ చేరింది. బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్(బీఎస్‌ఐ) స్కోరు 100కు 91.0తో పాటు ఏఏఏ+ రేటింగ్‌ను ఈ సంస్థ దక్కించుకుంది. నివేదికలోని అగ్రగామి 50 అంతర్జాతీయ బ్రాండ్లలో అమూల్ ఒక్కటే భారతీయ బ్రాండ్ కావడం విశేషం. అమూల్ ఏడాదికి 1100 కోట్ల లీటర్ల పాలను సమీకరిస్తుంటుంది. దీని విలువ రూ.80,000 కోట్లకు పైనే.
అత్యంత విలువైన ఆల్కహాలేతర పానీయాల బ్రాండ్లలో కోకకోలా (35 బి. డాలర్లు) తొలి స్థానంలో నిలిచింది. బలమైన ఆల్కహాలేతర పానీయాల బ్రాండ్‌గానూ ఇది కొనసాగింది. విలువైన బ్రాండ్లలో పెప్సి (20.2 బి. డాలర్లు) రెండో స్థానంలో నిలవగా.. డాక్టర్ పెప్పర్ (4.8 బి. డాలర్లు), స్పైట్ (4.5 బి. డాలర్లు) వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచాయి.
Latest news,Telugu news,Business news