Home బిజినెస్ వయనాడ్‌ విషాదం.. బాధితుల లోన్ల రైటాఫ్‌కు సీఎం విజ్ఞప్తి || Wayanad tragedy.. CM appeals for write-off of victims’ loans

వయనాడ్‌ విషాదం.. బాధితుల లోన్ల రైటాఫ్‌కు సీఎం విజ్ఞప్తి || Wayanad tragedy.. CM appeals for write-off of victims’ loans

0

 

Nsnnews// వయనాడ్‌: వయనాడ్‌ బాధితులకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అత్యవసర సాయం కింద రూ.10 వేలు అందించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలుప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటంతో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మొత్తాన్ని నేరుగా బాధితుల కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అయితే, ఈ సొమ్ము నుంచే కేరళ గ్రామీణ బ్యాంకు ఈ నెల ఈఎంఐలను కట్‌ చేసుకుంది. దీనిపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. వయనాడ్‌ వరదల బాధితుల రుణాలను రైటాఫ్‌ చేయాలని వివిధ బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. దీని వల్ల బ్యాంకులపై పెద్ద భారమేమీ ఉండదని వ్యాఖ్యానించారు. వెంటనే వాటిని రుణాలను రైటాఫ్‌ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. వడ్డీ మొత్తంలో మినహాయింపు, వాయిదాల చెల్లింపునకు గడువు పొడిగించడం వంటి చర్యల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీసుకున్న రుణాలను రైటాఫ్‌ చేయడమొక్కటే పరిష్కారమని తెలిపారు. ఈ సమయంలో బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి లోన్‌ ఈఎంఐలు తీసుకోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేరళ గ్రామీణ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వానికి నేరుగా 50 శాతం, పీఎస్‌యూ కెనరా బ్యాంకు ద్వారా మరో 35 శాతం వాటా ఉంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి 15 శాతం వాటా ఉంది. బ్యాంకులు ఇలా వరద సాయం నుంచి ఈఎంఐలు తీసుకోవడాన్ని కేరళ రాష్ట్ర సహకారశాఖ మంత్రి వీఎన్‌ వాసవన్‌ సైతం తప్పుబట్టారు. దీన్ని క్రూరమైన చర్యగా అభివర్ణించారు. సాయం మొత్తం తమ ఖాతాల్లో జమైన వెంటనే రూ.5,000 ఈఎంఐ కట్‌ అయ్యిందని చాలా మంది బాధితులు మీడియాకు తెలియజేశారు.
ఈ విషయాన్ని స్టేట్‌ లెవెల్‌ బ్యాంకర్స్‌ కమిటీ (SLBC) దృష్టికి తీసుకెళ్తామని మంత్రి వాసవన్‌ తెలిపారు. బ్యాంకులు మానవతా దృక్పథంతో ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాల్సిందని హితవు పలికారు. కానీ, అది జరగలేదని.. ఎస్‌ఎల్‌బీసీ సైతం దీనికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని పేర్కొన్నారు.
ఈ వ్యవహారానికి సంబంధించి స్థానిక గ్రామీణ బ్యాంక్‌ చీఫ్‌తో చర్చించామని ఎస్‌ఎల్‌బీసీ జనరల్‌ మేనేజర్‌ కేఎస్‌ ప్రదీప్‌ తెలిపారు. విపత్తు సంభవించడానికి ముందే ఇచ్చిన స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ వల్లే ఈ పొరపాటు జరిగినట్లు వివరించారు. మరోవైపు వరద సాయం నుంచి తీసుకున్న ఈఎంఐ మొత్తాన్ని తిరిగి బాధితుల ఖాతాల్లో జమ చేయాలని వయనాడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ గ్రామీణ బ్యాంకుకు ఆదేశాలు జారీ చేశారు.
జులై 30న కొండచరియలు విరిగిపడి వయనాడ్‌ జిల్లాలోని ముండక్కై, చురాల్‌మల తదితర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. మట్టిదిబ్బల కింద చిక్కుకొని దాదాపు 226 మంది మరణించినట్లు కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ లెక్క 300కు పైనే ఉంటుందని అనధికారిక సమాచారం. కొండచరియలు విరిగిపడటంతో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు.
Latest news,Telugu news,National News,Business News,Wayanad Landslides

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version