Nsnnews// దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం లాభాలు కొనసాగించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో మాంద్యం భయాలు తగ్గడం, ఐటీ షేర్లు రాణించడం కలిసి రావొచ్చని భావిస్తున్నారు. దేశీయంగా జూన్ త్రైమాసిక ఫలితాల సీజన్ ముగిసిన నేపథ్యంలో, బుధవారం వెలువడే యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశ వివరాల కోసం మదుపర్లు వేచిచూస్తున్నారు. సెప్టెంబరులో రేట్ల కోతలపై సంకేతాలు రావొచ్చనేది అంచనా. దేశీయంగా చూస్తే స్టాక్స్ అధిక విలువలపై ఆందోళన కొనసాగుతోంది. నిఫ్టీ-50 కీలక స్థాయి అయిన 25,000 పాయింట్లకు చేరకపోవచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..
- సిమెంటు కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడే కదలాడొచ్చు. వర్షాల కారణంగా ఈ త్రైమాసికంలో గిరాకీపై ప్రభావం పడొచ్చు. ఈ రంగ షేర్ల ధరలూ చౌకగా లేకపోవడమూ గమనార్హం.
- గనుల రంగంపై సుప్రీంకోర్టు తాజా తీర్పు వల్ల లోహ కంపెనీల షేర్లు ఒక శ్రేణిలోనే కదలాడొచ్చు. సంస్థల ఆర్థిక పనితీరుపై, తీర్పు ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై ఆయా యాజమాన్యాల వ్యాఖ్యల కోసం మదుపర్లు చూస్తున్నారు.
- టెలికాం షేర్లలో భారతీ ఎయిర్‌టెల్ లాభాల్లో.. వొడాఫోన్ ఐడియా నష్టాల్లో కొనసాగొచ్చు. మంగళవారం జరగబోయే రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంపై మదుపర్లు దృష్టి సారించొచ్చు. జియో ఐపీఓకు సంబంధించిన ఏజీఎమ్‌లో రిలయన్స్ ఏవైనా వ్యాఖ్యలు చేస్తే.. అవి కీలకంగా మారొచ్చు.
- అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సంకేతాలు సానుకూలంగా ఉండడంతో ఐటీ కంపెనీల షేర్లు రాణించే అవకాశం ఉంది. ఇటీవలి రిటైల్ వ్యయాలు, ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో అమెరికాలో మాంద్యంపై ఆందోళనలు తగ్గాయి. దీంతో సెప్టెంబరులో ఫెడ్ రేట్ల కోతలు విధిస్తే, ఐటీ కంపెనీలు రాణించొచ్చు.
- నిఫ్టీ బ్యాంక్ సూచీ ఒక శ్రేణిలో కదలాడొచ్చు. 50,805 వద్ద నిరోధం ఎదురుకావొచ్చు. 50,810పైన స్థిరంగా కొనసాగితేనే 51,200-51,500 శ్రేణికి వెళ్లొచ్చు. ఈ సూచీకి 49511.40 వద్ద మద్దతు కనిపిస్తోంది. డిపాజిట్ల వృద్ధి విషయంలో బ్యాంకులకు సవాళ్లు ఎదురవుతున్నాయి.
- ప్రయాణికుల వాహన గిరాకీలో స్తబ్దత ఉన్నా.. గ్రామీణ గిరాకీ రాణిస్తున్నందున ద్విచక్ర వాహన కంపెనీలు ప్రయోజనం పొందొచ్చు. ఈ నేపథ్యంలో వాహన షేర్లు మిశ్రమంగా ట్రేడవవచ్చు. అధిక సంఖ్యలో కొత్త మోడళ్ల ఆవిష్కరణలు, కార్ల గిరాకీకి చేదోడుగా నిలవవచ్చు.
- అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండడంతో, రక్షణాత్మక రంగమైన ఔషధ షేర్లు స్తబ్దుగానే ఉండొచ్చు. ఈ నెలలో ఇప్పటిదాకా 1.5% లాభాలను నిఫ్టీ ఫార్మా సూచీ అందుకుంది. ఈ షేర్లు సహేతుక ధరల వద్ద ఉన్నాయి.
- చమురు కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి కదలొచ్చు. ముడి చమురు ధరల కదలికలను మదుపర్లు గమనిస్తారు. పశ్చిమాసియాలో సంక్షోభం మరింత అధ్వానంగా మారితే, చమురు ధరలపై ప్రభావం చూపిస్తుంది.
- యంత్రపరికరాల షేర్లు రాణించొచ్చు. మార్జిన్లు పెరగడమే ఇందుకు కారణం. జూన్ త్రైమాసికంలో అంచనాలకు మించి ఆర్డర్లను ఇవి పూర్తి చేశాయి. ఇప్పటికే షేర్ల విలువలు భారీగా పెరిగినందున, పరిమితంగానే ముందుకెళ్లొచ్చు.
- ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు లాభాలందించొచ్చు. ఫలితాల వృద్ధిపై యాజమాన్యాల ధీమాకు తోడు గ్రామీణ గిరాకీ పుంజుకుంటుండడం, షేర్ల ధరలు ఆకర్షణీయంగా ఉండడం, ఇప్పటిదాకా వర్షాలు బాగా కురవడం ఇందుకు దోహదం చేయొచ్చు. పండగ సీజను మొదలైతే లాభాలు కొనసాగొచ్చు.
Latest news,Telugu news,Business news