Nsnnews// ఢాకా: అగ్రరాజ్యం అమెరికాకు తలొగ్గితే అధికారంలో కొనసాగేదాన్నేనని, సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టలేకే పదవి నుంచి వైదొలగానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు. త్వరలోనే స్వదేశానికి చేరుకుంటానని చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఢాకాలో ఆందోళనలు జరుగుతున్నప్పుడు జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి ఆమె ఒక ప్రసంగాన్ని సిద్ధం చేసుకున్నారు. ఆ పనిచేసేలోగానే ఆందోళనకారులు తన నివాసాన్ని చుట్టుముట్టడంతో దేశం విడిచి వెళ్లాల్సివచ్చిన విషయం తెలిసిందే. ఆ ప్రసంగం గురించి సన్నిహితులకు ఆమె వెల్లడించినట్లు పలు ప్రసార మాధ్యమాలు పేర్కొన్నాయి. ‘‘..వారు విద్యార్థుల శవాలను దాటుకుంటూ వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నారు. దానిని నేను సహించలేదు. ఒకవేళ నేను సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి.. అమెరికాకు బంగాళాఖాతంలో పట్టులభించేలా చేస్తే పదవిలో కొనసాగేదాన్ని. దానికి ఇష్టపడక ప్రధాని పదవికి రాజీనామా చేశాను. నేను బంగ్లాదేశ్‌లోనే ఉంటే మరిన్ని ప్రాణాలు పోయేవి. అందుకే అత్యంత క్లిష్టమైన నిర్ణయం తీసుకుని వైదొలిగాను. దయచేసి అతివాదుల మాయలో పడొద్దని నేను నా దేశ ప్రజలను కోరుతున్నాను’’ అని ఆమె పేర్కొన్నారు. ప్రజలే తన బలమని, వారు తనను వద్దనుకోవడంతో దేశం వీడానని చెప్పారు. తాను ఓడిపోయినా ప్రజలు గెలిచారని వ్యాఖ్యానించారు. వారికోసమే తమ కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందన్నారు. చాలామంది అవామీలీగ్ నాయకులు హత్యకు గురికావడంపై ఆవేదన చెందినట్లు తెలిపారు. తమ పార్టీ మరోసారి నిలదొక్కుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
Latest news,Telugu news,International news