Nsnnews// నారాయణగూడ : రైతు రుణమాఫీపై చర్చకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధమా అని బి.ఆర్.ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాలు విసిరారు. రుణమాఫీ పేరిట మోసం చేస్తున్న ప్రభుత్వంపై తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో శాంతియుతంగా సాగుతున్న నిరసన శిబిరంపై పలువురు దాడికి పాల్పడ్డారని శుక్రవారం డీజీపీ జితేందర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ నాయకత్వంలో రైతులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతుంటే 50 మంది కాంగ్రెస్ గూండాలు దాడి చేసి హింసాత్మక వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించారు. మా వాళ్లు తిరగబడి ఉంటే కాంగ్రెస్ వాళ్లు ఒక్కరూ మిగిలేవారు కాదు. ప్రజాస్వామ్యంలో హింస సమాధానం కాదని ఊరుకున్నారు. స్థానిక పోలీసులు స్వయంగా శిబిరం టెంట్‌ను కూల్చివేసి దాడి చేసిన వారికి వత్తాసు పలికారు. సీఎం రేవంత్ మంత్రులు, అధికారులు, పోలీసులు, గూండాలను అడ్డం పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వారి గొంతు నొక్కాలని చూస్తున్నారు.
సీఎం స్వగ్రామంలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య. ఆ ఆడబిడ్డలకు సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇటీవల కొందరు పోలీసులు మంత్రుల జన్మదిన వేడుకల్లో కేకులు కట్ చేస్తున్న విషయాన్ని కూడా డీజీపీ దృష్టికి తీసుకెళ్లాం. ఫామ్‌హౌస్ కూల్చివేతలపై పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు. ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లోని చెరువులు ఎలా పూడ్చారో, నిర్మాణాలు ఎలా వెలిశాయో శాటిలైట్ చిత్రాలు ఉన్నాయి. అవి చూసి వాటిని ముందు కూల్చివేయాలి. పొంగులేటి, వివేక్, కేవీపీ, మధుయాస్కీ, పట్నం మహేందర్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన తరువాత ప్రజలపై పడాలి’ అని పేర్కొన్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్ ఉన్నారు.
Latest news,Telugu news,Telangana News,BRS,KTR