Nsnnews// ఢిల్లీ: ఈ ఏడాది తొలి అర్ధభాగం (జనవరి- జూన్)లో మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. 2023 జవవరి- జూన్‌లో భారత్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండగా.. 2024 జనవరి- జూన్‌లో ఆ స్థానాన్ని అమెరికా ఆక్రమించింది. భారత్- అమెరికా మధ్య వాణిజ్యం 59.4 బిలియన్ డాలర్ల నుంచి 5.3% పెరిగి 62.5 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో చైనాతో రికార్డు స్థాయిలో వాణిజ్యలోటు నమోదైనట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) వెల్లడించింది. భారత్, చైనాల మధ్య వాణిజ్య లోటు 41.6 బిలియన్ డాలర్లు గా నమోదైంది. మనదేశం నుంచి చైనాకు ఎగుమతులు 8.5 బిలియన్ డాలర్లు కాగా… దిగుమతులు 50.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం 54.4 బి.డాలర్ల నుంచి 7.7% పెరిగి 58.6 బి.డాలర్లుగా నమోదైంది. జీటీఆర్‌ఐ గణాంకాల ప్రకారం..
- జనవరి- జూన్‌లో మనదేశం నుంచి వస్తువుల ఎగుమతులు 5.41% పెరిగి 230.51 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 5.47% అధికమై 345.30 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
- మన దేశం 239 దేశాలకు వస్తువులను ఎగుమతి చేసింది. ఇందులో 126 దేశాలకు ఎగుమతుల్లో వృద్ధి నమోదైంది. మొత్తం ఎగుమతుల్లో ఈ దేశాల వాటా 75.3%.
- యూఎస్‌ఏ, యూఏఈ, నెదర్లాండ్స్, సింగపూర్, చైనా లాంటి దిగ్గజ దేశాలకు భారత్ నుంచి ఎగుమతులు పెరిగాయి.
- మన దేశం నుంచి ఎగుమతులు తగ్గిన దేశాలు 98 కాగా.. భారత్ మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా 24.6 శాతంగా ఉంది. ఈ దేశాల్లో ఇటలీ, బెల్జియం, నేపాల్, హాంకాంగ్ లాంటివి ప్రధానంగా ఉన్నాయి.
- భారత్‌కు అమెరికా అతిపెద్ద ఎగుమతి భాగస్వామిగా నిలిచింది. 2023 జనవరి- జూన్‌లో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు 37.7 బిలియన్ డాలర్లు కాగా.. ఈ ఏడాది జనవరి- జూన్‌లో ఈ విలువ 10.5% పెరిగి 41.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
- యూఏఈకి మన ఎగుమతులు 15.8 బిలియన్ డాలర్ల నుంచి 24.9% పెరిగి 19.7 బి.డాలర్లకు చేరాయి.
- 2024 తొలి అర్ధభాగంలో చైనా నుంచి అధికమొత్తంలో వస్తువులు మన దేశానికి చేరాయి. వీటి విలువ గతేడాది తొలి 6 నెలల్లో 46.2 బిలియన్ డాలర్లు కాగా, ఈ ఏడాది ఇదే సమయంలో 50.1 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
మన ఎగుమతుల వృద్ధిలో
- ఇనుప ఖనిజం, ఔషధాలు, విలువైన రాళ్లు, బాస్మతి బియ్యం, రసాయనాలు, స్మార్ట్‌ఫోన్లు.. భారత ఎగుమతుల వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి.
- సేవల విషయానికొస్తే… భారత ఎగుమతులు 6.9% పెరిగి 178.20 బిలియన్ డాలర్లకు చేరాయి. మన దేశంలోకి సేవల దిగుమతులు 5.79% అధికమై 95 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
- జనవరి- జూన్‌లో వస్తువులు, సేవలతో కలిపి భారత మొత్తం వాణిజ్యం 5.8% పెరిగి 849 బి.డాలర్లుగా నమోదైంది.
Latest news,Telugu news,Business news