ద్విచక్ర వాహనం కారు ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రమైన గాయాలు
NSN న్యూస్ రాయపోల్:
ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం,కారు ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన రాయపోల్ మండలం కృష్ణ సాగర్ గ్రామం వద్ద బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. రాయపోల్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం రాజ బొల్లారం గ్రామానికి చెందిన కోటబాబు శేఖర్ పద్మశాలి వుత్తి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. వారి అత్తగారి ఊరైన రాయపోల్ నుంచి భార్య జోష్ణ దేవి, ఇద్దరు పిల్లలని తీసుకెళ్లడానికి ఏపీ 09 ఏడబ్ల్యు 5778 కారులో వచ్చాడు. సాయంత్రం కుటుంబ సభ్యులతో వారి ఇంటికి రాజ బొల్లారం వెళ్లే క్రమంలో కృష్ణ సాగర్ గ్రామ వద్దకు రాగానే అతి వేగంగా అజాగ్రత్తగా ద్విచక్ర వాహనం టీఎస్ 35 బీ 6534 గల దానిపై మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, కీసర మండలం బండ్లగూడ గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్, కుంభ దేవా ఇద్దరు వ్యక్తులు రాంగ్ రూట్ లో వచ్చి కారును ఢీకొట్టారు. ద్విచక్ర వాహనంపై వెనుకాల కూర్చునే వ్యక్తి ఎగిరి కారుపై పడి అక్కడి నుంచి కిందపడగా కుడికాలు, కుడి చేతికి తీవ్ర గాయాలు కావడంతో అధికంగా రక్తస్రావం అయింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తికి కూడా కుడికాలు, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కారు నడుపుతున్న వ్యక్తి కోటబాబు శేఖర్ 108 వాహనానికి సమాచారం అందించగా 108 వాహనం వచ్చేలోపే ద్విచక్ర వాహనం వెనుకాల కూర్చున్న కుంభ దేవ (35) తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాల పాలైన కట్ట ప్రేమ్ కుమార్ ను 108 వాహనంలో చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అజాగ్రత్తగా ద్విచక్ర వాహనాన్ని నడిపి, నా కారును ఢీ కొట్టి కుంభ దేవ మృతికి కారణమైన ద్విచక్ర వాహనం నడిపిన కట్ట ప్రేమ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కోటబాబు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయపోల్ ఎస్సై రఘుపతి తెలిపారు.