Nsnnews// ఇరాన్ పై దాడి చేస్తే ఆ తర్వాత తాము చేసే దాడులకు ఇజ్రాయెల్ బాధపడాల్సి వస్తుందని.. ఐఆర్ జీసీ చీఫ్ సలామీ హెచ్చరించారు. ఇరాన్ పై దాడి చేస్తే.. కచ్చితంగా తీవ్రంగా సమాధానం చెబుతామన్నారు. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలను దాటి ఇరాన్ క్షిపణులు చొచ్చుకుపోతాయని, తమపై దాడులు చేసి ఎవరూ సురక్షితంగా ఉండలేరని సలామీ అన్నారు. ఇజ్రాయెల్ బలహీనతలు తమకు బాగా తెలుసని పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులను దౌత్యపరంగా కూడా ఎదుర్కొనేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి పశ్చిమాసియా దేశాల్లో పర్యటిస్తూ మద్దతు కూడగడుతున్నారు. ఈజిప్ట్ ఉన్నతాధికారులతో చర్చలు మొదలుపెట్టారు. ఇప్పటికే సౌదీ అరేబియా, ఖతర్ , ఇరాక్ , లెబనాన్ లో ఆయన పర్యటించారు. అక్టోబర్ 1వ తేదీన ఇరాన్ దాదాపు 200 క్షిపణులతో ఇజ్రాయెల్ పై దాడులు చేసింది. వీటిల్లో కొన్ని లక్ష్యాలకు అత్యంత సమీపంలో పడ్డాయి. మిగిలిన వాటిని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇజ్రాయెల్ సన్నద్ధమైంది. ఇరాన్ లో ఏయే లక్ష్యాలను ధ్వంసం చేయాలన్న అంశంపై ఇప్పటికే ఒక స్పష్టమైన ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
Latest news,Telugu news,International news