Nsnnews// ఏపీకి తుపాను గండం గడిచింది. చెన్నై- నెల్లూరు మధ్య ప్రాంతం తడ వద్ద వాయుగుండం తీరం దాటినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
వాయుగుండం తీరం దాటడంలో ఏపీలో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం చెన్నై-నెల్లూరు మధ్య తీరం దాటింది. పశ్చిమ వాయువ్య దిశగా 22 కి.మీ వేగంతో కదులుతూ తీరాన్ని తాకింది. అనంతరం అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వాయుగుండం కారణంగా ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. నిన్న సాయంత్రం ఐదున్నర గంటలకు వాయుగుండం చెన్నైకి 190 కిలోమీటర్ల దూరంగా కేంద్రీకృతమైంది. అది క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. వాయుగుండం తీరం దాటే సమయంలో ఎక్కడా వర్షపు జాడ కనిపించలేదు. తీరం దాటడానికి ముందు ఆరు గంటల నుండి 22 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదిలిన తుఫాను ఆ తర్వాత నెమ్మదించింది. ఇదిలా వుండగా మరో పది రోజుల్లో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒకటి ఉండనుంది. ఇది వాయవ్య దిశగా పయనించి 24 నాటికి ఒడిశా తీరానికి చేరుతుందని ఓ అంచనా వేశారు అధికారులు. ఈనెల చివరలో మరో అల్పపీడనం ఏర్పడ వచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఏపీపై పెద్దగా ప్రభావం లేకపోయినప్పటికీ, విస్తారంగా వర్షాలు పడవచ్చని అంటున్నారు.
Latest news,Telugu news,Andhra Pradesh news