Nsnnews// ఏపీ సర్కార్ వరద బాధితులకు ఆర్థికసాయం ప్రకటించింది. తాజాగా ఆర్థికసాయాన్ని మరింత పెంచుతూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనకు అనుగుణంగా.. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా నేడు ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా ..రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నిర్దేశించిన మొత్తం కంటే.. ఆర్థిక సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌డీఆర్‌ఎఫ్ నిర్దేశించిన మొత్తం కంటే.. అదనంగా ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను మార్చుతూ.. రెవెన్యూశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 17న సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనకు అనుగుణంగా.. వరద ముంపు బాధితులకు ఈ సాయం చేయనున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది. 179 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఇళ్లు పూర్తిగా నీట మునిగిన బాధితులకు.. ఎస్‌డీఆర్‌ఎఫ్ నిర్దేశించిన 11వేలకు బదులుగా 25వేల ఆర్థిక సాయం చేయనున్నారు. అలాగే మొదటి ఫ్లోర్‌లో ఉన్న ముంపు బాధితులకు 10వేలు, వరదలకు ధ్వంసమైన దుకాణాలకు 25వేలు ఇవ్వనుండగా.., వ్యవసాయ పంటలకు హెక్టారుకు 25వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. వరదలు, వర్షాల కారణంగా ఇళ్లు ధ్వంసమైన వారికి కూడా.. గృహ నిర్మాణ పథకాల కింద ఇంటిని నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
Latest news,Telugu news,Andhra pradesh news