Nsnnews// హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పించి, వారిలో అభద్రతా భావాన్ని దూరం చేస్తామని మహిళా సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఆసుపత్రుల్లోని వైద్యుల భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలతో పాటు వైద్యశాలలు, మెడికల్ కళాశాలల్లో షీ టీమ్స్ గస్తీ పెంచుతామన్నారు. మహిళల భద్రత కోసం మంత్రులు, ఉన్నతాధికారులతో కమిటీ వేస్తామని, భద్రత కోసం ఒక నివేదికను సీఎంకు అందిస్తామని వెల్లడించారు. బుధవారం సచివాలయంలో మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద, మహిళా ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్ శోభారాణితో కలిసి సమీక్ష నిర్వహించారు. ‘‘మహిళలపై హింసకు డ్రగ్స్, గంజాయి కారణమవుతున్నాయి. వీటి కట్టడికి చర్యలు చేపట్టాం. మహిళా భద్రత కోసం ప్రతిశాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తాం. అన్ని ప్రభుత్వ విభాగాల్లో మహిళా కమిటీలు నియమిస్తాం. బాలికలు, మహిళలను గౌరవించేలా పాఠ్యాంశాలు తీసుకువస్తాం. టి-సేఫ్ యాప్ ద్వారా పోలీసులకు సమాచారమిస్తే మహిళలు గమ్యస్థానం చేరేవరకు భరోసా కల్పిస్తారు’’ అని తెలిపారు. మహిళాభద్రత కోసం శాశ్వతంగా కొనసాగే ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నేరెళ్ల శారద తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కమిటీలను 15 రోజుల్లో ఏర్పాటు చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Latest news,Telugu news,Telangana news