Nsnnews// పారిస్: పక్షం రోజులకు పైగా కనులపండువగా సాగిన పారిస్ ఒలింపిక్స్- 2024 క్రీడలు ఆదివారం రాత్రి ముగింపు కార్యక్రమాలకు సిద్ధమవగా.. ఆ పక్కనే ఉన్న ప్రపంచ ప్రఖ్యాత ఐఫిల్ టవర్ పైకి ఎక్కిన ఓ ఆగంతకుడు పోలీసులను పరుగులు తీయించాడు. బహుశా.. 1,083 అడుగుల ఎత్తు ఉన్న ఆ బురుజుపై కూర్చొని కళ్లు మిరుమిట్లు గొలిపే క్రీడాసంబరాల ముగింపును చూడాలని అనుకున్నాడేమో! వేడుకల ప్రారంభానికి కొన్ని గంటల ముందు బనియనుతో ఉన్న ఓ వ్యక్తి ఐఫిల్ పైకి ఎక్కుతున్న వైనాన్ని ఫ్రెంచ్ పోలీసులు గుర్తించారు. పర్యాటకులు అందరినీ ఆ ప్రాంతం నుంచి అరగంటలో ఖాళీ చేయించారు. టవర్ రెండోభాగంలో అలంకరించిన ఒలింపిక్స్ లోగో రింగులపై కదులుతున్న సమయంలో అతణ్ని గమనించారు. ప్రపంచ క్రీడలు జరుగుతున్న నేపథ్యంలో పారిస్ నిండా 30,000 మంది పోలీసులను మోహరించారు. ఇందులో మూడు వేలమంది ఒలింపిక్స్ స్టేడియం చుట్టూనే ఉన్నారు. ఇంత భద్రత నడుమ అతడు ఎటువైపు నుంచి ఎక్కడం మొదలుపెట్టాడో ఎవరూ గుర్తించలేకపోయారు.
Latest news,Telugu news,International News,Paris Olympics 2024