Nsnnews// ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిన్నతెల్లవారుజామున ఉన్నావ్ పట్టణంలో ఓ పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..మరో 30మందికి పైగా గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఉన్నావ్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఆగ్రా-లక్నో రహదారిపై ఉదయం 5.15 గంటల సమయంలో పాల కంటైనర్‌ను వెనుక నుంచి డబుల్ డెక్కర్ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు పూర్తిగా భాగంగా కంటైనర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నిద్రలోనే 18 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ బస్సు బీహార్‌లోని సీతీమర్హి నుంచి ఢిల్లీ వెళ్తుండగా.. బంగార్‌మావు ప్రాంతంలోని జోజికోట్ గ్రామ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుందని బంగార్‌మావ్ సర్కిల్ ఆఫీసర్ అరవింద్ కుమార్ తెలిపారు. కాగా, ఈ ప్రమాద సమయంలో బస్సు రెండు పల్టీలు కొట్టి ముక్కలైందని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను పోలీసులు బయటకు తీసి బంగార్ మావు సీహెచ్‌సీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో 14 మంది పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఈ ఘటనపై యూపీ రవాణాశాఖ మంత్రి దయాశంకర్ సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
Latestnews, Telugunews, UttarPradesh, Road accident…