Nsnnews// హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న దేవుడిమాన్యాలను గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. దేవాలయాల్లో నిత్య పూజా కైంకర్యాల నిర్వహణ, అర్చకుల జీవనోపాధి కోసం నిజాం, కాకతీయుల ప్రభువుల నుంచి సామాన్య భక్తుల వరకు వివిధ ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో భూములు విరాళంగా ఇచ్చారు. కానీ వీటి వివరాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పటికే పెద్ద మొత్తంలో భూములు అన్యాక్రాంతం అయ్యాయి. మరికొన్ని మాన్యాలకు సంబంధించిన వ్యాజ్యాలు ట్రైబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మాన్యాలన్నింటికీ భౌగోళిక సమాచార వ్యవస్థ(జీఐఎస్) ద్వారా జియో ట్యాగింగ్ చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. దీనికోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురావస్తుశాఖలు, రాష్ట్ర ఓరియంటల్ మాన్యు స్క్రిప్ట్స్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇలా పలు సంస్థల సహకారంతో దేవాదాయశాఖ కొన్నేళ్లుగా విస్తృతస్థాయిలో సర్వే చేస్తున్నా ఈ కసరత్తు కొలిక్కిరాలేదు. ముఖ్యంగా భూములు ఎక్కడ ఉన్నాయి? వాటి సరిహద్దులు ఎక్కడ? అనేవి చిక్కుముడులుగా మారాయి. దీంతో ఆయా భూముల పరిరక్షణకు… భౌగోళిక సరిహద్దులను నిర్ణయించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) సహకారం తీసుకోవాలని దేవాదాయశాఖ నిర్ణయించింది.
భూముల క్రోడీకరణ కోసం ఎన్ఆర్ఎస్ఏ అధికారులకు దేవాదాయశాఖ వద్ద ఉన్న సమాచారాన్ని అందజేయాలని నిర్ణయించింది. దేవాదాయ శాఖకు తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లో 91,827 ఎకరాలున్నాయి. స్పష్టత ఉన్న వివరాల మేరకు దేవాదాయ శాఖ అధికారులు సుమారు 15 వేల ఎకరాలను గుర్తించి జీఐఎస్ వ్యవస్థకు అనుసంధానం చేశారు. వాటిలో కూడా సుమారు 1,136 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించారు. 2,031 ఎకరాలను లీజుకు ఇచ్చారు. 723 ఎకరాల విషయంలో వివిధ న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు సాగుతున్నాయి. 439 ఎకరాల వరకు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. మరో 10,670 ఎకరాల భూమి వివిధ అవసరాల కోసం వినియోగంలో ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన భూములకు భౌగోళిక సరిహద్దులను గుర్తించే బాధ్యతలను ఎన్ఆర్ఎస్ఏకు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. రెండు విభాగాల అధికారులు ఇప్పటికే పలు దఫాలు సంప్రదింపులు నిర్వహించారు. త్వరలో ఈ ప్రక్రియ కార్యరూపంలోకి రానుంది.
Latest news,Telugu news,Andhra Pradesh News ,Telangana News…