Nsnnews// దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. అనేక నదులు,వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోనూ గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అక్కడ స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలతో అక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కిన్నౌర్ జిల్లాలో నిరంతరం రద్దీగా ఉండే కొండ ప్రాంతంలో భారీగా కొండ రాళ్లు విరిగిపడ్డాయి. దానితో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఆ రోడ్డును మూసివేశారు. సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో రాకపోకలపై నిషేధాజ్ణలు విధించారు. ఇలాంటివే మరికొన్ని ప్రమాద కర రహదారులను గుర్తించారు. దాదాపు 14 రోడ్లు మూసివేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని..చాలా చోట్ల ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. అత్యవసరం అయితే తప్ప వాహనాలు బయటకు తీయొద్దని హెచ్చరిస్తున్నారు.
భారీ నుంచి అతి భారీ వర్షాలు..
మరో రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చాలా ప్రాంతాలలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గత నెలలో కురిసిన వర్షాలతో భారీగా ఆస్తి నష్టం కలిగిందని అధికారులు చెబుతున్నారు. దాదాపు మూడువందల కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అలాగే వరదలు, వర్షాలకు ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య నలభై నాలుగు మందిగా ప్రకటించారు. రాగల 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. చంబా, మండి జిల్లాలకు భారీ వర్షాల ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని..లోతట్టు ప్రాంత ప్రజలు హెల్పింగ్ కేంద్రాల నుంచి అవసరమైతే సహాయం పొందాలని సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు సెలవులు రద్దు చేసింది. అంతా అప్రమత్తమై ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించింది.
Latest news,Telugu news,National news…