Nsnnews// కోల్‌కతా హత్యాచార ఘటన నేపథ్యంలో.. బంగాల్ మెడికల్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. మరణించిన తమ సోదరి సాధించిన విజయంగా జూనియర్ వైద్యులు అభివర్ణించారు. ఆలస్యంగానైనా బంగాల్ మెడికల్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకోవడంపై.. వారు ఆనందం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా హత్యాచార ఘటనలో.. ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దయింది. బంగాల్ మెడికల్ కౌన్సిల్ ఆయన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. బంగాల్ మెడికల్ యాక్ట్-1914లోని పలు నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు WBMC అధికారులు తెలిపారు. ఘోష్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలంటూ.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బంగాల్ విభాగాన్ని ఇటీవల కోరింది.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7న మెడికల్ కౌన్సిల్ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించగా.. మాజీ ప్రిన్సిపల్ నుంచి స్పందన రాకపోవడంతో వేటు పడినట్టు తెలుస్తోంది. సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయడంపై జూనియర్ వైద్యులు స్పందించారు. ఇది మరణించిన తమ సోదరి సాధించిన విజయంగా అభివర్ణించారు. ఘోష్ అరెస్టైన మరుసటి రోజే అతని మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు కావాల్సి ఉందన్న జూనియర్ వైద్యులు… ఎట్టకేలకు పశ్చిమ బంగాల్ మెడికల్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు.
Latest news,Telugu news,National news,Crime news