Nsnnews// కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన యావత్ దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. పనిచేస్తున్న చోటే అత్యంత పాశవికంగా ఆమెపై అఘాయిత్యం జరిగిన తీరు ప్రతీ హృదయాన్ని మెలిపెడుతోంది. ఈ ఘటనకు సంబంధించి తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తె డైరీ లో ఓ పేజీ చిరిగి ఉందని బాధితురాలి తండ్రి చెబుతున్నారు. ‘‘మా అమ్మాయి బ్యాగులో ఎప్పుడూ పర్సనల్ డైరీ ఉంటుంది. దాన్ని మేం ఎప్పుడూ చదవలేదు. హాస్పిటల్‌కి వచ్చాక తను రోజూ మాతో అన్ని విషయాలు పంచుకుంటుంది. ఘటన తర్వాత తన డైరీని చూస్తే అందులో ఓ పేజీ కొంత చిరిగి ఉంది. దానికి సంబంధించిన ఫొటో నా వద్ద ఉంది’’ అని బాధితురాలి తండ్రి ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. అయితే, అందులో ఏముందనే విషయాన్ని బయటపెట్టేందుకు ఆయన నిరాకరించారు. ఆ విషయాలను బహిరంగంగా చర్చించొద్దని సీబీఐ తమకు సూచించినట్లు తెలిపారు.
ఆమె శరీరంపై 14 చోట్ల గాయాలు..
ఇదిలా ఉండగా.. వైద్యురాలి పోస్ట్‌మార్టం నివేదిక గురించి మరిన్ని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె శరీరంపై 14 చోట్ల గాయాలున్నాయని శవపరీక్షలో గుర్తించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బలవంతంగా లైంగిక చర్య జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని, దీని కారణంగా ఆమె వ్యక్తిగత అవయవాల వద్ద లోతైన గాయం జరిగినట్లు ఆ నివేదికలో ఉంది. ఊపిరితిత్తుల్లో అధిక మొత్తం రక్తస్రావం జరిగినట్లు పోస్ట్‌మార్టంలో గుర్తించారు.
ఘటన సమయంలో ఆమె నిందితుడితో శక్తిమేరకు పోరాడి ఉంటుందని వైద్యులు పోస్ట్‌మార్టం నివేదికలో పేర్కొన్నారు. నిందితుడు సంజయ్ రాయ్‌కి వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు అతడి శరీరంపై గోళ్లతో రక్కిన గుర్తులు కన్పించాయట. బాధితురాలి మృతదేహాన్ని పరిశీలించగా.. ఆమె గోళ్లలోని చర్మం, రక్త నమూనాలు నిందితుడి నమూనాలతో సరిపోలినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడం వల్లే ఆమె మృతిచెందినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో పేర్కొన్నారు. బాధితురాలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో నిందితుడు ఈ దాడికి పాల్పడి ఉంటాడని ఆ నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తోంది.
శరీరంపై బెడ్‌షీట్ కప్పి..
మరోవైపు, వైద్యురాలి మృతదేహాన్ని తొలిసారి చూసిన ఓ సాక్షి మీడియాతో మాట్లాడారు. ‘‘సెమినార్ హాల్‌లోని పోడియం వద్ద ఆమె విగతజీవిగా కన్పించింది. ఒంటిపై కుర్తా చిందరవందరగా చిరిగిపోయింది. ట్రౌజర్స్ కన్పించలేదు. మెడ నుంచి మోకాలి వరకు నీలం రంగు బెడ్‌షీట్ కప్పి ఉంది. ఆమె ల్యాప్‌టాప్, నోట్‌బుక్, సెల్‌ఫోన్, వాటర్‌బాటిల్ పక్కనే ఉన్నాయి’’ అని ఆ సాక్షి ఓ జాతీయ మీడియాకు వివరించారు. సెమినార్ హాల్‌లో విశ్రాంతి తీసుకునేందుకు వచ్చిన ఆమె ఒంటరిగా ఉందని గ్రహించి నిందితుడు ఈ దారుణానికి పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Latestnews, Telugunews, Kolkata, Kolkata Doctor Rape and Murder Case…