Nsnnews// కోల్‌కతా హత్యాచార ఘటనపై 42రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు.. ఎట్టకేలకు విధుల్లో చేరారు. వారి డిమాండ్లకు మమతా సర్కార్ అంగీకరించడం వల్ల.. నిన్నటి ఉదయం నుంచి బంగాల్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులకు హాజరయ్యారు.
అత్యవసర సేవల్లో మాత్రమే అందుబాటులో ఉన్నారు వైద్యులు. ఔట్ పేషెంట్ సేవలను బహిష్కరించారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం 7 రోజుల గడువు ఇచ్చినట్టు తెలిపిన జూనియర్ డాక్టర్లు..ఆ తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే మళ్లీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆర్‌జీ కర్ హత్యాచార ఘటనలో.. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఘటనతో సంబంధమున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆగస్టు 9వ తేదీ నుంచి జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. వారి ఆందోళనతో దిగొచ్చిన బంగాల్ ప్రభుత్వం.. రెండు దఫాలుగా చర్చలు జరిపింది. వారి డిమాండ్లలో చాలావరకు అంగీకరించింది. దీంతో.. జూనియర్ డాక్టర్లు శాంతించి విధులకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు ఆర్జీకర్ మెడికల్ కళాశాల ఆర్థిక అవకతవకలపై సీబీఐ చేపట్టిన దర్యాప్తులో.. కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి అంతా ఇంతా కాదని తెలుస్తోంది. ఆయన హయాంలో ఆర్‌జీ కర్ ఆస్పత్రి ఔషధాల కొనుగోళ్లలో అనేక లోపాలను సీబీఐ గుర్తించింది. రోగులకు ఇచ్చే మందుల కొనుగోలు ఇష్టారాజ్యంగా చేశారని ఆరోపించింది. బయటి ఏజెన్సీల నుంచి ఔషధాల కొనుగోలు జరిగినట్టు పేర్కొంది. బిడ్డర్లను సాంకేతిక మూల్యాంకనం చేయడం వంటి కీలకమైన ప్రక్రియను విస్మరించినట్టు వెల్లడించింది. ప్రముఖ వైద్య సంస్థలకు ఔషధాలను సరఫరా చేసేటప్పుడు.. సంబంధిత నైపుణ్యం ఆధారంగా బిడ్డర్‌లను షార్ట్‌లిస్ట్ చేస్తారు. సాంకేతిక మూల్యాంకనంలో ఇది తొలి దశ. ఇక రెండో దశలో షార్ట్‌లిస్ట్ చేసిన బిడ్డర్లలో అతితక్కువ ధరను కోట్ చేసిన వారికి కాంట్రాక్ట్ ఇస్తారు. ఇదంతా సాంకేతిక మూల్యాంకన విధానం ద్వారానే జరుగుతుంది. బిడ్డర్లు సరఫరా చేసే ఔషధాలు, వస్తువులపై రోగుల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అయితే మూల్యాంకనానికి సంబంధించిన పత్రాలను పరిశీలించిన సీబీఐ,..సందీప్ ఘోష్ హయాంలో ఎన్నో అవకతవకలు జరిగినట్టు ఆరోపించింది.
Latest news,Telugu news,National news