Nsnnews// ఢిల్లీ: కృత్రిమ మేధ ఆధారంతో క్రియేట్ చేసిన ఆహార పదార్థాల చిత్రాలను తమ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించనున్నట్లు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ వెల్లడించారు. అలాంటి చిత్రాలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంటూ చాలామంది కస్టమర్ల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
‘‘మా పనిని సమర్థంగా చేయడానికి జొమాటోలో కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నాం. రెస్ట్టారంట్ మెనూల్లోని వంటకాల చిత్రాల కోసం మాత్రం ఏఐని వాడడాన్ని మేం ఆమోదించడం లేదు. ఏఐ ఆధారంగా రూపొందించిన చిత్రాలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి. ఈ సమస్యపై కస్టమర్ల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. దీన్ని విశ్వాసఘాతుకంగా అభివర్ణిస్తున్నారు. అధిక ఫిర్యాదులు, రిఫండ్‌లు, తక్కువ రేటింగ్‌లకు దారితీయొచ్చని అంటున్నారు. అందుకే ఏఐ ఇమేజెస్ వాడొద్దని మా భాగస్వామ్య రెస్టరెంట్లను కోరుతున్నాం. ఈనెలాఖరులోగా మెనూల నుంచి అటువంటి చిత్రాలను తొలగించడం ప్రారంభిస్తాం. ఇకపై అలాంటి చిత్రాలను ఉపయోగించడాన్ని నిలువరిస్తాం. వీలైనంతవరకు అలాంటివాటిని ఆటోమేషన్ సాంకేతికతతో గుర్తించేందుకు ప్రయత్నిస్తాం’’ అని దీపిందర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
వంటకాల నిజమైన చిత్రాలను ఇప్పటివరకు తీయకపోయి ఉంటే జొమాటోలోని కేటలాగ్ విభాగం నుంచి సాయం తీసుకోవాలని రెస్టారంట్లకు దీపిందర్ సూచించారు. వారు అద్భుతమైన చిత్రాలు తీయడంలో సాయం చేస్తారని వెల్లడించారు. దానికి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపారు.
Latest news,Telugu news,Telangana news