Nsnnews// రాష్ట్రంలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై.. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్‌తో నిర్వహించిన సమావేశంలో చర్చించినట్టు ఏపీ ఎంపీలు తెలిపారు. విజయవాడలోని రైల్వే ఈటీటీసీ కేంద్రంలో జరిగిన సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 21 వేల కోట్ల రైల్వే లైన్ల ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయని.. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో 73 రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తున్నామని స్పష్టం చేశారు. తిరుపతి, నెల్లూరు, విజయవాడ రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రైళ్లు ఢీకొట్టకుండా కవచ్‌ను రాష్ట్రంలో నిర్ణీత కిలోమీటర్లలో అమలు చేస్తున్నామని తెలిపారు. గతేడాది 35 రైళ్లు ప్రవేశపెట్టగా వీటిలో 6 వందేభారత్ రైళ్లు ఉన్నాయని వివరించారు. అమరావతి కోసం ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు లైన్ సర్వే పూర్తయిందని తెలిపారు. రైల్వే బోర్డు ఆమోదం, నిధులు రాగానే కొత్త రైల్వే లైన్ పనులు ప్రారంభిస్తామని అన్నారు. రాష్ట్ర ఎంపీలు ఇచ్చిన ప్రతిపాదనలను.. రైల్వే బోర్డుకు పంపుతామని అరుణ్‌కుమార్ జైన్ అన్నారు. ఆర్వోబీలు, ఆర్‌యూబీలు అభివృద్ధి చేయాలని.. అలానే రాష్ట్రానికి మరిన్ని కొత్త రైళ్లు, వందేభారత్ రైళ్లు కావాలని కోరినట్లు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడలో డ్రైనేజీ సమస్య రైల్వేతో ముడిపడి ఉందని అన్నారు. రైల్వే, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కమిటీ ఏర్పాటును కోరినట్టు తెలిపారు. రాజధాని అమరావతిని కలుపుతూ త్వరలో రైల్వే ట్రాక్ రాబోతుందని.. ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు.
రేపల్లె-బాపట్ల మధ్య కొత్త లైన్ కావాలని కోరినట్టు ఎంపీలు కృష్ణప్రసాద్, లక్ష్మీనారాయణ, నాగరాజు తెలిపారు. విజయవాడ-గూడూరు మధ్య నాలుగో లైన్ ఏర్పాటు, బాపట్ల, చీరాలలో వందేభారత్ రైలు స్టాప్ ఉండాలని కోరినట్టు వివరించారు. విజయవాడ-బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ కావాలని ప్రతిపాదించామని అన్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్‌లో సమస్యలు పరిష్కరించాలని అడిగినట్లు తెలిపారు. విజయవాడ-బెంగళూరు మధ్య కొండవీడు ఎక్స్‌ప్రెస్ రోజూ నడపాలని బెంగళూరు-పుట్టపర్తి ఎక్స్‌ప్రెస్‌ను అనంతపురానికి పొడిగించాలని కోరినట్లు తెలిపారు. కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్ల మంజూరుకు జీఎంను కోరినట్టు పేర్కొన్నారు. అవసరమైనచోట్ల రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు కోరామని.. అలానే కర్నూలులో రైల్వే వర్క్‌షాప్‌ను అభివృద్ధి చేయాలని అడిగినట్టు స్పష్టం చేశారు.
Latest news,Telugu news,National news