న్యూయార్క్: ఇండోనేషియా, ఇథియోపియాలలో ‘737 మ్యాక్స్’ విమానాలు రెండు నేలకూలి, వందలమంది మరణించిన దుర్ఘటనలపై అమెరికా న్యాయ స్థానంలో కేసును పరిష్కరించుకునేందుకు దిగ్గజ విమానాల తయారీ సంస్థ బోయింగ్ సిద్ధపడింది. నేరాన్ని అంగీకరించడమే కాకుండా, జరిమానా కింద 243.60 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2000 కోట్లు) చెల్లించేందుకు బోయింగ్ సమ్మతించిందని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. న్యాయ సంస్థతో కేసు పరిష్కార షరతులపై సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు బోయింగ్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ ఒప్పందానికి న్యాయమూర్తి అనుమతి లభించాల్సి ఉందని తెలిపారు. ఒప్పందంలో భాగంగా.. రక్షణ, నిబంధనల పాటింపు చర్యల నిమిత్తం వచ్చే మూడేళ్లలో కనీసం 455 మిలియన్ డాలర్లను (సుమారు రూ.3,700 కోట్లు) బోయింగ్ వెచ్చించనుంది. ఆయా ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబీకులను బోయింగ్ బోర్డు కలవాల్సి ఉంటుంది. ఒప్పంద షరతులను బోయింగ్ పాటిస్తుందా? లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ఒక స్వతంత్ర పర్యవేక్షకుడిని కూడా నియమిస్తారు.
- 2018- 2019 మధ్య ఐదు నెలల వ్యవధిలో ఇండోనేషియా, ఇథియోపియాలలో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు నేలకూలాయి. ఈ ఘటనల్లో 346 మంది మరణించారు. ఆ కేసుల పరిష్కార ఒప్పందంపై బాధిత కుటుంబాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. న్యాయ విచారణను బోయింగ్ ఎదుర్కోవడమే కాకుండా.. ఆ సంస్థపై ఆర్థికపరంగా కఠిన చర్యలను చేపట్టాలని వాళ్లు కోరుకుంటున్నారు. ప్రమాదాల విషయంలో నేర అంగీకారం వల్ల, అమెరికా రక్షణ విభాగం, నాసా లాంటి ప్రభుత్వ విభాగాల నుంచి కాంట్రాక్టులు పొందే విషయంలో బోయింగ్ సామర్థ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
- 2021లో కుదుర్చుకున్న కేసు పరిష్కార ఒప్పందంలోనూ ఇంతే మొత్తాన్ని (సుమారు రూ.2,000 కోట్లు) జరిమానా చెల్లించేందుకు బోయింగ్ అంగీకరించింది. అయితే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు న్యాయ స్థానం గుర్తించడంతో క్రిమినల్ కేసు విచారణను బోయింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
Latest news,Telugu news,Business news…