-డబ్బుల కోసం బాలున్ని కిడ్నాప్ చేసిన నిందితులు -బాలుని తండ్రికి ఫోన్ చేసి రూ.15 లక్షల డిమాండ్ – సీసీ కెమెరాలో నిందితుల గుర్తింపు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పట్టివేత -నిందితులను జ్యూడిషియల్ రిమాండ్ కు తరలింపు – సీపీ డా. అనురాధ – మూడు గంటల్లో కేసును ఛేదించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి అభినందన, రివార్డు అందజేత*
-పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన బాలుని తండ్రి…
NSN NEWS//
వివరాల్లోకి వెళ్తే బడికి వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన మూడు గంటల లోనే బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఘటన మర్కుక్ మండలం కరకపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. శనివారం సిద్దిపేట సీపీ డా. అనురాధ తెలిపిన వివరాల ప్రకారం…. బీహార్ కు చెందిన తబ్రీజ్ ఆలం వద్ద అదే రాష్ట్రానికి చెందిన అనూప్ చౌదరి 8 నెలల క్రితం పనిచేశాడు. ఈ క్రమంలో తబ్రీజ్ ఆలం అనూప్ చౌదరికి కొంత డబ్బులు బాకీ పడ్డారు. బాకీ డబ్బులు ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా తబ్రీజ్ ఆలం పట్టించుకోక పోవడంతో అనూప్ చౌదరి, జార్కoడ్ రాష్ట్రానికి చెందిన చందన్ కుమార్ దాస్, అస్సాం రాష్ట్రానికి చెందిన మేఘనాథ్ కర్మాకర్ లు కిడ్నాప్ కు పథకం రచించారు, కర్కపట్ల ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న తబ్రీజ్ ఆలం కుమారుడు తావిద్ అలంను కిడ్నాప్ చేశారు. బాలుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టు ప్రక్కల విచారించగా గుర్తు తెలియని వ్యక్తులు
చెప్పులు కొనిస్తామని తావిద్ ఆలంను తీసుకెళ్లినట్లు తెలిపారు. తబ్రీజ్ ఆలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మర్కుక్ ఎస్ ఐ మధుకర్ రెడ్డి సీసీ పుటేజ్ పరిశీలించగా ఓ వ్యక్తి బాలుడుని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా బాలుడి తండ్రికి కిడ్నాపర్లు ఫోన్ చేసి రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మర్కుక్ ఎస్ఐ, గజ్వేల్ రూరల్ సీఐ ఆధ్వర్యంలో టీంగా ఏర్పడిన పోలీసులు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, రైల్వే పోలీసు సహకారంతో సాంకేతిక ఆధారాల ద్వారా నింధితులను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పట్టుకున్నారు. కిడ్నాప్ కేసును మూడు గంటల్లో ఛేదించిన గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, మర్కుక్ ఎస్ఐ మధుకర్ రెడ్డి, కానిస్టేబుల్స్ నరసింహ, సాయి, రాజిరెడ్డి లను సీపీ అనురాధ అభినందించి నగదు రివార్డు అందజేశారు.
కృతజ్ఞతలు తెలిపిన బాలుని తండ్రి
– కిడ్నాపైన తన కొడుకు ను సురక్షితంగా అప్పగించిన పోలీసులకు బాలుని తండ్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన కొడుకును కాపాడిన సిద్దిపేట పోలీస్ కమిషనర్, పోలిస్ సిబ్బందికి ఎప్పటికి రుణపడి ఉంటానని అన్నారు.