Nsnnews// తమ పంటలకు మద్దతు ధర చెల్లింపులపై కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా గత రెండేళ్లుగా రైతు ఉద్యమం ఊపందుకుంది. అయినా కేంద్రం చలించలేదు. రైతు ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేస్తూ వచ్చింది. పంజాబ్, హర్యానా రైతులు మొదటినుంచి రైతు ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. నాడు 2020 సంవత్సరంలో రైతు భారీ ఎత్తున ఢిల్లీలో తమ డిమాండ్ల సాధన కోసం ఉధృతంగా ఆందోళన చేసిన విషయం విదితమే. ఆ తర్వాత రైతు ఉద్యమాలు జరుగుతునే ఉన్నాయి. కేంద్రం మాత్రం వాటిని అణిచివేస్తూ వస్తోంది. దాని ప్రభావం కూడా మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో స్పష్టంగా కనిపించింది. రైతులను ప్రతిపక్షాలే రెచ్చగొడుతున్నాయని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఇదెలా ఉంటే ఇప్పుడు మరోసారి రైతులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తమ డిమాండ్లు సాధించుకోవడానికి సిద్ధపడుతున్నారు. వర్షాకాల సమావేశాల తర్వాత ఆగస్టులో రైతు ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో చేయాలని రైతు ఉద్యమ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై కిసాన్ మజ్దూర్ మోర్చా ఓ కీలక ప్రకటన చేసింది. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఉద్యమాన్ని సాగిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా కూడా దీనికి మద్దతుగా తన నిర్ణయం తెలియజేసింది. ఇప్పుడు ఈ రెండు సంఘాల పిలుపు మేరకు ఆగస్టులో ఉద్యమన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్లేందుకు రైతులు సిద్ధపడుతున్నారు.
త్వరలో కార్యాచరణ..
ఇందుకు సంబంధించిన కార్యాచరణ త్వరలోనే అందజేస్తామని అన్నారు. అన్ని జిల్లాలు, గ్రామాలు, పట్టణాలలో బీజేపీ దిష్టిబొమ్మలు దహనం చేయాలని, మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించాలని, వారిని ఊళ్లకు రాకుండా అడ్డుకోవాలని నిరసన కార్యక్రమాలు మరింత తీవ్రస్థాయిలో చేసి డిమాండ్లు తీర్చుకునే దిశగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ట్రాక్టర్లతో ర్యాలీ..
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా రైతులంతా ట్రాక్టర్ మార్చ్ నిర్వహించాలని పిలుపు నిచ్చారు. ఆగస్టు 1 నుంచి రైతులు పాద యాత్రలు చేయాలని,అడుగడునా నిరసనలు తెలియజేయాలని అన్నారు. అయితే ప్రజలకు, అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉద్యమం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సారి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి రైతు సమస్యలను తీర్చేలా ఉద్యమాన్ని చేయాలని పిలుపునిచ్చారు. పంజాబ్, హర్యానా ప్రాంతంలో త్వరలోనే కీలక సమావేశం నిర్వహిస్తామని..ఆ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నామని రైతు సంఘాల నేతలు అన్నారు. కేంద్రం బలవంతంగా అణిచివేయాలని చూస్తే ఉద్యమం మరింత ఉధృత స్థాయికి తీసుకెళతామని అన్నారు. పోలీసు చర్యలకు భయపడేది లేదని..అవసరమైతే జైల్ భరో అంటూ వేలాదిగా జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే అని అన్నారు. తక్షణమే రైతులపై ప్రభావం చూపే చట్టాలను తొలగించాలని..రైతులకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని..ఈ సారి సానుకూలంగా స్పందించవచ్చని తాము భావిస్తున్నామని చెప్పారు. ఆగస్టు 31 నాటికి ఢిల్లీ రైతులు నిర్వహిస్తున్న పాద యాత్ర రెండు వందల రోజులు పూర్తి చేసుకుంటుందని అన్నారు. ట్రాక్టర్ మార్చ్ తో రైతుల తడాఖా ఏమిటో కేంద్రానికి తెలిసొచ్చేలా చేస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.
Latest news,Telugu news,National news…