Nsnnews// ఒక యూట్యూబర్ హద్దు దాటి ప్రవర్తించాడు. భారత్‌తో పాటు పలు దేశాల గురించి ప్రస్తావిస్తూ అవాకులు, చెవాకులు పలికాడు. చిన్నపాటి ఉల్లంఘనకు పాల్పడినా ఆ దేశాలపై అణుబాంబులు వేస్తామంటూ వెర్రి మాటలు మాట్లాడాడు. అదంతా జోక్ అట..! దాంతో అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ యూట్యూబర్ పేరు మైల్స్ రూట్‌లెడ్జ్. అతడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘నేను బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యాక.. మా దేశ ప్రయోజనాలకు ఆటంకం కలిగించే విదేశీ శక్తికి అణుమార్గంలోనే నా సమాధానం ఉంటుందని స్పష్టమైన హెచ్చరికలు చేస్తాను. పెద్ద ఘటనలు జరిగేవరకు నేను చూడను. చిన్నపాటి ఉల్లంఘనలకే నేను ఆ దేశాలపై అణ్వాయుధాలు ప్రయోగిస్తాను’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ విదేశాల జాబితాలో భారత్ పేరును కూడా పేర్కొన్నాడు. ఆ దేశం తనకు ఇష్టం లేదని వ్యాఖ్యానించాడు. దాంతో అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
ఎవరీ మైల్స్..
బ్రిటన్‌కు చెందిన మైల్స్ రూట్‌లెడ్జ్.. సంక్షోభ ప్రాంతాల్లో పర్యటన చేస్తుంటాడు. విపత్కర సమయాల్లో ఆ దేశ ప్రజలు ఎలాంటి దుర్భర జీవితం గడుపుతున్నారో చూసి, తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తుంటాడు. 2021, ఆగస్టు 15న అఫ్గానిస్థాన్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గద్దె దింపి, తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరికలు ఖాతరు చేయకుండా దానికి రెండు రోజుల ముందు అఫ్గానిస్థాన్ వెళ్లాడు. తర్వాత అక్కడ చిక్కుకుపోయిన అతడిని ఆగస్టు 17న బ్రిటన్ ఆర్మీ తరలించింది. బుర్ఖా ధరించి ఆ దేశం నుంచి బయటపడ్డాడు. అలాగే అక్కడి అనుభవాలను పుస్తకం రూపంలో తీసుకువచ్చాడు. ప్రమాదకర టూరిస్టుగా పేరు తెచ్చుకున్న అతడు.. తన ప్రయాణాన్ని ఆ ఒక్క దేశానికే పరిమితం చేయలేదు. దక్షిణ సూడాన్, ఉక్రెయిన్ సహా సంక్షోభాలు ఎదుర్కొంటున్న పలు దేశాలకు వెళ్తూనే ఉన్నాడు.
Latestnews, Telugunews, UK YouTuber, frenzy talk…