Nsnnews// ముంబయి: దేశంలో బ్లూ-కాలర్ ఉద్యోగుల జీతాలకు సంబంధించి ఓ ఆసక్తికర నివేదిక వెలువడింది. ఈ రంగంలో మెజారిటీ ఉద్యోగులకు నెలకు రూ.20వేలు అంతకంటే తక్కువే వేతనం అందుతోందని పేర్కొంది. దీంతో వారు ఆర్థికంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, విద్య, వైద్యం, నివాసం వంటి కనీస అవసరాలను అందుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. బ్లూ-కాలర్ ఉద్యోగులను రిక్రూట్ చేసుకునే ప్లాట్‌ఫామ్ వర్క్ ఇండియా ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. వివిధ రంగాలకు చెందిన 24 లక్షల జాబ్ పోస్టింగ్ డేటాను రెండేళ్లుగా విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది.
టెలికాలింగ్, సేల్స్, ఫ్రంట్ డెస్క్, డెలివరీ జాబ్స్, ఆరోగ్య సంరక్షణ తదితర ఉద్యోగాలు బ్లూ కాలర్ విభాగంలోకి వస్తాయి. దేశంలోని 57.63 శాతం బ్లూకాలర్ ఉద్యోగుల వేతనాలు రూ.20వేలు, అంతకంటే తక్కువే ఉంటున్నాయని నివేదిక తెలిపింది. 29.34 శాతం మంది ఉద్యోగుల వేతనాలు కాస్త మెరుగ్గా ఉన్నాయని, వారు నెలకు రూ.20వేల నుంచి రూ.40వేల వరకు అందుకుంటున్నారని తెలిపింది. అయితే, అనుభవం వల్ల ఈ కేటగిరీలో ఉద్యోగులు కాస్త అధిక వేతనం పొందుతున్నప్పటికీ.. సౌకర్యవంతమైన జీవనానికి ఇంకా చాలా దూరంలో ఉంటున్నారని పేర్కొంది. అవసరాలు తీరగా.. స్వల్పమొత్తంలో పొదుపు చేసేందుకు మాత్రమే వీలుంటోందని పేర్కొంది.
బ్లూకాలర్ జాబ్స్ సెక్టార్‌లో ఎక్కువ మొత్తంలో ఆర్జించేందుకు అవకాశాలు తక్కువేనని వర్క్ ఇండియా సీఈఓ, సహ వ్యవస్థాపకుడు నీలేశ్ దుంగర్వాల్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి నైపుణ్య శిక్షణ, వేతన సంస్కరణలు, అధిక వేతనం అందించే ఉద్యోగావకాశాలు కల్పించడమే పరిష్కారం అని పేర్కొన్నారు. కేవలం 10.71 శాతం మంది బ్లూకాలర్ ఉద్యోగులు మాత్రమే రూ40-60 వేల వేతనం అందుకుంటున్నారని, రూ.60వేలకు పైగా వేతనం అందుకుంటున్నవారి సంఖ్య 2.31 శాతం మాత్రమేనని నివేదిక పేర్కొంది.
Latest news,Telugu news,Business news