Nsnnews// ఢిల్లీ: బ్రిటన్‌తో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం అతి త్వరలో ఖరారు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దానికి గడువు విధించడం ద్వారా తమ తలపై తుపాకీ గురి పెట్టొద్దని యూకేలోని కొత్త ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఆయన ఆ దేశానికి చెందిన మీడియా సంస్థతో మాట్లాడారు. ఏ ఒప్పందానికైనా డెడ్‌లైన్ ఉండాలనేదాన్ని భారత్ విశ్వసించదన్నారు. తలకు తుపాకీ గురిపెట్టినట్లు.. ఏ దేశంతోనూ తాము ఇంతవరకూ బలవంతంగా, ఒత్తిడి తెచ్చి ఎఫ్‌టీఏ చర్చలు జరపలేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ చేసిన తప్పిదాన్ని పునరావృతం చేయొద్దని సూచించారు.
గత కొద్ది సంవత్సరాలుగా భారత్-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. 2022 జవవరిలో ఏఫ్‌టీఏ చర్చలు ప్రారంభం కాగా.. అదే ఏడాది దీపావళికి ఒప్పందంపై ఒక కొలిక్కి రావాలని అప్పటి ప్రధాని బోరిస్ జాన్సన్ గడువు విధించారు. కానీ అనుకున్నట్లుగా అది జరగలేదు. ఆ తర్వాత ప్రధానిగా వచ్చిన రిషి సునాక్ నేతృత్వంలో కొత్తగా డెడ్‌లైన్ ఏదీ విధించనప్పటికీ.. భారత్, యూకేలో సార్వత్రిక ఎన్నికల్లోగా దానిపై అవగాహనకు రావాలని రెండు దేశాలు భావించాయి. కానీ అది కూడా వీలు కాలేదు.
అయితే, భారత్ ఎఫ్‌టీఏను సత్వరం ఖరారు చేసుకునేందుకు తాను సిద్ధమేనంటూ ఇటీవల బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కీర్ స్టార్మర్ చెప్పారు. ఇది రెండువర్గాలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. గతంలోనూ లేబర్ పార్టీ నేతలు ఈ ఒప్పందం ఒక కొలిక్కి రావాలని ఆకాంక్షించారు. ఎఫ్‌టీఏలో భాగంగా పలు వస్తువులకు సుంకం మినహాయింపుతో పాటు ఐటీ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ఎక్కువ అవకాశాలను భారత్ ఆశిస్తోంది. అదే సమయంలో స్కాచ్ విస్కీ, ఆటోమొబైల్స్, గొర్రె మాంసం, చాక్లెట్లు వంటి ఉత్పత్తులపై దిగుమతి సుంకంపై యూకే మినహాయింపులు కోరుతోంది.
Latestnews, Telugunews, Delhi, FTA, Piyush Goyal…