Nsnnews// అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ఇరు పార్టీల అభ్యర్థులపై విస్త్రృత చర్చ జరుగుతోంది. వయోభారం ఉన్న నేతలు ఎన్నికల్లో పోటీ పడనున్నారనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో జో బైడెన్ స్థానంలో ఓ యువనేత, సమర్థవంతమైన వ్యక్తి రానున్నాడని రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ కూడా అప్రమత్తంగా ఉండాలని సొంతపార్టీని హెచ్చరించారు.
‘‘రాబోయే మార్పును ఎదుర్కొనేందుకు రిపబ్లికన్లు సిద్ధంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. అధ్యక్ష అభ్యర్థిగా ఒకవేళ బైడెన్‌ను కొనసాగిస్తే.. డెమోక్రాటిక్ పార్టీ మనుగడ సాగించే అవకాశం లేదు. అందుకే ఓ యువ అభ్యర్థిని తీసుకువచ్చే యోచనలో ఆ పార్టీ ఉంది. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ ఉండరని కచ్చితంగా చెప్పగలను. గుర్తుపెట్టుకోండి’’ అని భారత సంతతి రాజకీయవేత్త, దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ బరిలో దిగిన ఆమె.. ఇటీవలే పోటీ నుంచి వైదొలి ట్రంప్‌నకు మద్దతు ప్రకటించారు.
ట్రంప్-బైడెన్ మధ్య జరిగిన తొలి డిబేట్‌లో అధ్యక్షుడు బైడెన్ తడబాటుకు గురికావడం ఆ పార్టీలో ఆందోళనకు కారణమయ్యింది. ఈ క్రమంలో బైడెన్ సన్నిహితుడు, రచయిత జై పరిణి స్పందిస్తూ.. అధ్యక్ష పోటీ నుంచి బైడెన్ వైదొలగాలని సూచించారు. వయసుతోపాటు ఇటీవల జరిగిన డిబేట్‌లోనూ వెనుకంజ వేసిన నేపథ్యంలో తాను ఈ సూచన చేస్తున్నానని చెప్పారు.
Latest news,Telugu news, International, Donald Trump ,Joe Biden….