Nsnnews// వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ పోటీపై స్వపక్షం నుంచే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బరి నుంచి వైదొలగబోనని ఇప్పటికే ఆయన తేల్చి చెప్పారు. అయినప్పటికీ.. రేసు నుంచి పక్కకు జరగాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆయనకు అత్యంత సన్నిహితుడు, హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోటీలో ఉండాలా? లేదా? అనే విషయంపై కొన్ని రోజుల్లో బైడెన్ తన నిర్ణయం వెల్లడిస్తారని శనివారం తెలిపారు.
గ్రీన్ ఇటీవల బైడెన్ సహా ఇతర డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన నుంచి ఈ తరహా ప్రకటన వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని బైడెన్ భావిస్తే.. ఆ స్థానంలో కమలా హ్యారిస్‌ను ఆయన ప్రతిపాదించే అవకాశం ఉందని తెలిపారు. ‘‘గెలవడం సాధ్యం కాదని అధ్యక్షుడు భావిస్తే ఆయన పోటీ నుంచి వైదొలగుతారు. ఆయన సన్నిహిత వర్గాలు సైతం పోటీ నుంచి దూరం కావాలని డిమాండ్ చేసినా అభ్యర్థిత్వంపై పునరాలోచిస్తారు. ఆ పదవికి తాను తగినవాడిని కాదని భావిస్తే ఆయన కచ్చితంగా పక్కకు జరుగుతారు. దీనిపై బైడెన్ త్వరలో తన నిర్ణయాన్ని వెల్లడిస్తారు’’ అని మీడియాతో మాట్లాడుతూ గ్రీన్ అన్నారు.
-
ఇరాన్‌లో సంస్కరణలవాది గెలుపు..
ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని క్లిష్ట సమయాలు ఉంటాయని గ్రీన్ అన్నారు. సొంతింట్లోనే పెద్దవాళ్లు అప్పుడప్పుడు వారి అభిప్రాయాలను వ్యక్తపర్చడంలో తడబడుతుంటారని తెలిపారు. అంతమాత్రాన వారి అనుభవం, తెలివితేటలు, కుటుంబంలో వారి పాత్రను విస్మరించలేమని తెలిపారు. అందుకే తాను ఇప్పటికీ బైడెన్‌కు మద్దతుగా ఉన్నానని పేర్కొన్నారు. పరోక్షంగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌తో జరిగిన సంవాదంలో బైడెన్ తడబడినంత మాత్రాన ఆయన సామర్థ్యాన్ని అనుమానించాల్సిన అవసరం లేదని వివరించారు.
మరోవైపు వయసులో ట్రంప్ సైతం తక్కువేమీ కాదని గ్రీన్ గుర్తుచేశారు. బైడెన్ కంటే కేవలం మూడేళ్లు మాత్రమే చిన్నవారన్నారు. అధ్యక్షుడికి వయసుతో సంబంధంలేదని.. బాధ్యతలకు కట్టుబడి ఉండడం మాత్రమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. అర్ధరాత్రి లేచి వివిధ దేశాల మధ్య అగ్గిరాజేసే ట్వీట్లు చేసే అధ్యక్షుడు మనకు అవసరం లేదని పరోక్షంగా ట్రంప్‌ను విమర్శించారు. బైడెన్‌తో అలాంటి సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు.
బైడెన్ పోటీ నుంచి నిష్క్రమించాల్సి వస్తే ఆ స్థానంలో ఎవరు ఉండాలనే విషయంపై ఆయనకే వదిలేస్తే బాగుంటుందని గ్రీన్ అభిప్రాయపడ్డారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను ప్రతిపాదిస్తే మొత్తం డెమోక్రాటిక్ పార్టీ ఆనందిస్తుందని తాను భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం ఆమె కంటే మెరుగైన అర్హులు ఎవరూ లేరని పేర్కొన్నారు.
Latestnews, Telugunews, Washington, Democratic Party, Joe Biden,