Nsnnews// శ్రీపెరంబదూర్: తైవాన్ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్, మన దేశంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (బీఈఎస్‌ఎస్) యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్ యంగ్ లీ వెల్లడించారు. విద్యుత్ వాహనాల విభాగంపై దృష్టి సారించిన ఫాక్స్‌కాన్, ఇందుకోసం బ్యాటరీ తయారీ వ్యాపారాన్ని విస్తరిస్తోంది. తైవాన్‌లో ఇప్పటికే తొలి ప్లాంట్ ఏర్పాటు చేసింది కూడా. ఫాక్స్‌కాన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విభాగం భారత్‌లో ఇప్పుడే ప్రారంభమైందని లీ తెలిపారు. ‘మేము 3+3 భవిష్యత్ పరిశ్రమను భారత్‌లో ఉంచడానికి ఎదురుచూస్తున్నాం. తమిళనాడులో బీఈఎస్‌ఎస్‌కి ఎలా సహకరించాలనే దాని గురించి ఇక్కడి పరిశ్రమల మంత్రితో చర్చించాను. 3+3 వ్యూహంలో భాగంగా 3 కీలక పరిశ్రమలైన విద్యుత్ వాహనాలు, డిజిటల్ హెల్త్, రొబోటిక్స్‌పై ఫాక్స్‌కాన్ దృష్టి సారించనుంది. ఈ 3 విభాగాలకు గణనీయమైన వృద్ధి అవకాశాలున్నాయి. ప్రస్తుత 1.4 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.116 లక్షల కోట్ల) స్థాయి నుంచి, ఇవి 20% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) సాధించే అవకాశం ఉంద’ని లీ పేర్కొన్నారు. బీఈఎస్‌ఎస్‌లు పునరుత్పాదక సౌర, పవన వనరుల నుంచి ఇంధనాన్ని స్టోరేజీ చేస్తాయి. ఫాక్స్‌కాన్ బ్యాటరీ స్టోరేజీ వ్యాపారం విద్యుత్ వాహనాలపై ఎక్కువ దృష్టి సారించనుందని తెలుస్తోంది.
Latest news,Telugu news,Business news