Nsnnews// ఈరోజుల్లో సాటి మనిషికి సాయపడే వారు అరుదు. ఎంతసేపు నేను, నా కుటుంబం అంటూ ఆలోచించేవారే ఎక్కువ. కానీ ఓ గ్రామానికి చెందిన యువకులు పేద విద్యార్థులకు సాయమందించేందుకు ముందుకొచ్చారు. తమ వంతుగా విద్యార్థులకు చేయూతనందించారు. విద్యార్థులకు బాసటగా నిలిచిన ఆ యువకులను పలువురు అభినందిస్తున్నారు. ఇంతకీ ఆ యువకులది ఏ గ్రామం.. వారి చేసిన సాయమెంటో తెలుసుకుందాం. రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మౌలిక వసతులు అరకొరగా ఉంటాయి. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో హైయ్‌లీ క్వాలీఫైడ్ టీచర్స్ ఉన్నప్పటికీ వసతుల కొరతతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు మొగ్గుచూపడం లేదు. కానీ సిద్దిపేట జిల్లా కుకూనూర్‌పల్లి మండలం రాయవరం గ్రామానికి చెందిన కొందరు యువకులు తమ గ్రామంలోని పాఠశాలకు ఇలాంటి పరిస్థితి రావొద్దని సంకల్పించారు.
తాము చదివి విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలకు తమవంతుగా అండగా ఉంటామని నిర్ణయించుకున్నారు. పాఠశాలను జిల్లా స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు ఉడుతభక్తిలా సాయపడాలనే ఉద్దేశ్యంతో గ్రామానికి చెందిన యువకులు శంకర్‌గౌడ్, చరణ్, ప్రవీణ్, వెంకటేశ్, రసం కర్ణాకర్, రాగం వెంకటేశ్ యాదవ్, ప్రవీణ్ ముదిరాజ్, చరణ్‌లు ముందుకొచ్చారు. గ్రామస్తుల సహకారంతో గ్రామంలోని పేద విద్యార్థులకు అండగా నిలిచారు. గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు, అండ్ బెల్ట్‌లు అందజేశారు. 40వేల విలువగల డ్రెస్సులను స్కూల్‌లోని 90మంది విద్యార్థులకు ఉచితంగా అందించారు. విద్యార్థులకు ఉచితంగా డ్రెస్సులు అందజేసిన యువకులను గ్రామస్తులు అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయులు యవకులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ విద్యార్థులను చదువులో ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశ్యంతో స్పోర్ట్స్ డ్రెస్సులు అందించామన్నారు. విద్యార్థులకు సేవ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. భవిష్యత్‌లో కూడా తాము చదివిన పాఠశాలకు అండగా ఉంటామని హామీనిచ్చారు. అనంతరం స్కూల్ హెచ్ఎం మంజుల మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందన్నారు. ప్రయివేట్ స్కూళ్లకు ధీటుగా బోధన చేస్తున్నామని.. విద్యార్థుల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. జిల్లా స్థాయిలో పాఠశాలకు పేరు తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ సీహెచ్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు జయశ్రీ, అశోక్, స్వామి, శారద విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Latestnews, Telugunews, Kukunurpalli, Govt School. Youth Distributed, Sports Dresses..