Nsnnews// రాష్ట్రంలో ప్రభుత్వ భూములు దక్కించుకుని… పరిశ్రమలు పెట్టని సంస్థలకు తెలంగాణ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. ఇందూటెక్ జోన్, బ్రాహ్మణి ఇన్ఫ్రాటెక్ సహా నిర్మాణాలు ప్రారంభించని కంపెనీల భూముల్ని.. 4 నెలల్లో స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే పనులు మొదలైన వాటిలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో 2001 నుంచి 2006 వరకూ ఎలాంటి ప్రకటన లేకుండా, వేలం నిర్వహించకుండా, నామినేషన్ పద్ధతిపై 4,156 ఎకరాలను పలు కంపెనీలకు, వ్యక్తులకు కారుచౌకగా విక్రయించినట్టు హైకోర్టు స్పష్టం చేసింది. లీజుపై కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. ఛత్రి అనే స్వచ్ఛంద సంస్థ 2007లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్ట్ సుదీర్ఘ విచారణ చేపట్టి 72 పేజీల తీర్పు వెలువరించింది. పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే… పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయని గుర్తుచేసింది. వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించినందున పిటిషనర్ కోరినట్లుగా… ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సొమ్ము వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తే.. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు విరుద్ధం అవుతుందని అభిప్రాయపడింది. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఐతే పరిశ్రమలు ఏర్పాటు చేయని కంపెనీల నుంచి భూములను స్వాధీనం చేసుకోలేదనే పిటిషనర్ వాదనను సమర్థించింది. భూ కేటాయింపులు జరిగినా నిర్మాణాలు ప్రారంభించని ఇందూటెక్ జోన్, బ్రాహ్మణి ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్, స్టార్‌గేజ్ ప్రాపర్టీస్‌లతో పాటు…, అనంత టెక్నాలజీస్, జెటీ హోల్డింగ్‌లకు కేటాయించిన భూములను 4 నెలల్లో రద్దు చేయాలని తీర్పు వెలువరించింది. ఆలోగా వాటిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం తన విధానాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ… భూకేటాయింపులపై చర్యలు తీసుకుంటోందని, అందుకే భూకేటాయింపుల విషయంలో, ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోలేమంటూ… పిటిషన్‌పై విచారణను మూసేసింది.
Latest news,Telugu news,Telangana news