Nsnnews// నేషనల్ హెరాల్డ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నివేదించిన అంశాల పై లిఖిత పూర్వకంగా నోట్ దాఖలు చేయాలని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి, కాంగ్రెస్ అగ్రనాయకులను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
నేషనల్ హెరాల్డ్ కేసుపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి, కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు లిఖిత పూర్వక నోట్ దాఖలు చేయాని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. తదుపరి విచారణను అక్టోబర్ 29కి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితు లను ప్రాసిక్యూట్ చేయడానికి తనకు అనుమతి ఇవ్వాలని సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటీషన్‌ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చడంతో 2021 ఫిబ్రవరి 11 స్వామి హైకోర్టును ఆశ్రయించారు.
ఇంతకీ ఈ కేసు వ్యవహారం ఏంటి? నేషనల్ హెరాల్డ్ పత్రికను 1938లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ ఈ పత్రికను ప్రచురించేది. అయితే 1942లో బ్రిటీష్ సర్కార్ దీనిపై నిషేధం విధించింది. మూడేళ్ల తర్వాత మళ్లీ ప్రచురణ మొదలైంది. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రధానిగా నెహ్రూ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆ పత్రిక బోర్డు ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
అప్పటి నుంచి నేషనల్ హెరాల్డ్ పత్రిక కొనసాగింది. అయితే ఆర్థిక కారణాల వల్ల ఆ పత్రిక 2008లో మూతపడింది. మళ్లీ 2016లో డిజిటల్ పబ్లికేషన్ రూపంలో మళ్లీ మొదలైంది. బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి 2012లో ట్రయల్ కోర్టులో కేసు వేశారు.
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ చెందిన రెండువేల కోట్ల రూపాయల ఆస్తులను సొంతం చేసుకునేందుకు ప్లాన్ చేశారన్నది ఆయన ప్రధాన ఆరోపణ. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన నిధులను ఉపయోగంచుకున్నారన్నది ఆరోపణ. ఏజేఎల్ మూసివేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి మొత్తం 90 కోట్ల రూపాయల బకాయి ఉందన్నది మరో పాయింట్.
ఈ సంస్థలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు ఉన్నారని, కంపెనీలో వారిద్దరికీ చెరొక 38శాతం వాటా ఉందని ప్రస్తావించారు. మిగతా 24 శాతం కాంగ్రెస్ నేతలు మోతీలాల్‌వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, జర్నలిస్టు సుమన్‌దూబె, పారిశ్రామికవేత్త శ్యామ్‌పెట్రోడాలకు ఉందని వివరిస్తూ స్వామి వేసిన పిటిషన్‌లో వీరి పేర్లను చేర్చారు. వేల కోట్ల విలువైన ఆస్తులను సొంతం చేసుకోవడానికి ముఖ్య నేతలు ప్లాన్ చేశారన్నది సుబ్రమణ్యస్వామి ఆరోపణ.
Latest news,Telugu news,National news…