Nsnnews// అమెరికా పర్యటనలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం, విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్‌లో జేకేఎన్‌సీ దేశ వ్యతిరేక, రిజర్వేషన్ వ్యతిరేక ఎజెండాకు మద్దతు ఇవ్వడం ద్వారా… ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు.
రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. దేశ భద్రత, మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఫైరయ్యారు హోంమంత్రి అమిత్ షా . భాష నుండి భాష, ప్రాంతం నుండి ప్రాంతం, మతం నుండి మతానికి వివక్ష గురించి మాట్లాడటం ..ఆయన విభజన ఆలోచనను తెలియజేస్తుందని స్పష్టం చేశారు. దేశంలో రిజర్వేషన్‌ను రద్దు చేయాలనే ఉద్దేశంతోనే.. రాహుల్ గాంధీ మరోసారి కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక ముఖాన్ని దేశం ముందుకు తీసుకొచ్చారని అన్నారు. రాహుల్ మనసులోని ఆలోచనలు ఎల్లప్పుడూ ఏదో ఒక రూపంలో బయటపడుతుంటాయని, బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్‌ను ఎవరూ ముట్టుకోలేరని హెచ్చరించారు. దేశ సమైక్యతతో ఎవరూ ఆడుకోలేరని రాహుల్ గాంధీకి చెప్పాలనుకుంటున్నానని అన్నారు అమిత్ షా. అంతకుముందు, అమెరికా పర్యటనలో భాగంగా జార్జ్‌టౌన్ వర్సిటీలో విద్యార్థులతో మాట్లాడారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా రిజర్వేషన్లపై మాట్లాడుతూ, దేశంలో అంతా సెట్ అయినప్పుడు రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచిస్తామని అన్నారు. దీంతో బీజేపీ నేతలు వరుసబెట్టి విమర్శలు చేస్తున్నారు. గాంధీ కుటుంబానికి రిజర్వేషన్లు ఇష్టం లేదని, కాంగ్రెస్ కూటమిలోని నేతలు గతంలో చాలా మాట్లాడారని, ఇప్పుడు రాహుల్ గాంధీ తన వైఖరిని తెలియజేశారంటూ మండిపడుతున్నారు.
Latest news,Telugu news,National news