Nsnnews// దిల్లీ: జమ్మూ-కశ్మీర్‌లో సైనిక వాహనంపై ఉగ్రవాదులు మెరుపుదాడి(Kathua Attack)కి పాల్పడిన ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దీనికి ముందు ఉగ్రవాదులు స్థానికుల్ని బెదిరించినట్లు తెలుస్తోంది. వారి తలపై తుపాకీ గురిపెట్టి, తమ కోసం భోజనం తయారుచేయించుకున్నారని ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది. అలాగే దాడి సమయంలో ఉగ్రవాదులు బాడీ కెమెరాలు ధరించి ఉన్నారు. భద్రతా బలగాల నుంచి ఆయుధాల దోపిడీకి ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాన్ని మన సైనికులు తిప్పికొట్టారు. గాయపడినా సరే వారికి మాత్రం ఆయుధాలను దక్కనివ్వలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఓ సైనికుడి చేతికి తీవ్రంగా గాయమైనప్పటికీ తన ఆయుధం జామ్ అయ్యేవరకు ఒక్క చేతితోనే కాల్పులు కొనసాగించడం గమనార్హం.
కఠువాకు 150కి.మీ. దూరంలో ఉన్న బద్‌నోతా గ్రామ సమీపంలోని మాచేడీ- కిండ్లీ- మల్హార్ రోడ్డులో రెండు సైనిక వాహనాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి (Kathua Attack) చేశారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు వారిని దీటుగా ఎదుర్కొనేందుకు ఎదురు కాల్పులు జరిపారు. అప్పటికే ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న జవాన్లు.. మరింత ప్రాణనష్టం జరగకుండా నిరోధించడంతోపాటు ఆయుధాలను ఎత్తుకెళ్లిపోకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రతిఘటించారు. ఉగ్రవాదులకు-జవాన్లకు మధ్య రెండు గంటలకుపైగా కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు.
Latest news,Telugu news,National News,Jammu Kashmir News