Nsnnews// ఏపీలోని జనసేన తరహా పార్టీ తమిళనాడులోనూ ఆవిర్భవించింది. ప్రముఖ తమిళ హీరో విజయ్.. తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీని కొన్నాళ్ల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అప్పట్లో తన పార్టీ సిద్ధాంతాలను ప్రకటించలేదు. దీనిపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. కానీ, ఆదివారం సాయంత్రం విల్లుపురం జిల్లాలో నిర్వహించిన టీవీకే పార్టీ తొలి మహానాడులో ఆయన తన పార్టీ సిద్ధాంతాలు సహా భవిష్యత్తును ఆవిష్కరించారు. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టినట్టు ఆయన చెప్పారు. కేంద్రంలోని బీజేపీని, రాష్ట్రంలోని డీఎంకేని ఆయన తూర్పార బట్టారు. నిరంకుశ పాలనకురెండు ప్రభుత్వాలు కేరాఫ్‌గా నిలుస్తున్నాయని విమర్శలు గుప్పించారు.
ఇక్కడ పవన్ మాదిరిగానే..
ఏపీలో తొలినాళ్లలో జనసేన అధినేత పవన్‌ను నటుడు.. సినిమాలు చేసుకునేవాడు.. అంటూ కొందరు విపక్ష నాయకులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అలానే విజయ్‌నుకూడా.. రాజకీయంగా ఆటపట్టించడం గమనార్హం. ఈ విషయాన్ని విజయ్ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. “నన్ను ఆర్టిస్ట్ అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. అయినా వెరవను. నటులు ప్రజాసేవకు పనికి వస్తారని ఎన్నో ఉదంతాలు చాటి చెబుతున్నాయి. ఏపీలో నందమూరి తారక రామారావు, తమిళనాడులో ఎంజీఆర్‌లు రాణించలేదా..? ప్రజా నాయకులుగా వెలుగొందలేదా?” అని తనదైన శైలిలో ఆయన ప్రసంగించారు.
అనుభవం లేదని..
జనసేన అధినేత 2014లో పార్టీని ప్రకటించినప్పుడు.. అనుభవం లేదంటూ.. కొందరు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సేమ్ టు సేమ్.. విజయ్‌ను ఉద్దేశించి కూడా కొందరు ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి కూడా విజయ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘‘నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు. కానీ, నేను పాలిటిక్స్ విషయంలో భయపడడం లేదు’’ అని అన్నారు. సినిమాలతో పోల్చుకుంటే.. రాజకీయాలు ఎలా ఉంటాయో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు.
ఇక్కడ అందరూ రాజకీయాలతో ఆడుకునే వారేనని చెప్పారు. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా నన్ను అవమానించారు. అయినా, కఠోర శ్రమ, ధైర్యంతో ఈ స్థాయికి చేరుకున్నా అని విజయ్ వ్యాఖ్యానించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీతో విజయం సాధించి, అధికారంలోకి రావడమే లక్ష్యమని విజయ్ ప్రకటించారు.
ఇవీ.. సిద్ధాంతాలు..
.ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాల పరిరక్షణ
.లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలను అనుసరించడం.
.పెరియార్ రామస్వామి, కామరాజ్ నాడార్, అంబేడ్కర్ ఆశయాల సాధన
.బీజేపీ, డీఎంకేల నిరంకుశ వైఖరిపై పోరాటాలు
.రాజకీయాల్లో మహిళలకు కీలక పాత్ర
Latest news, Telugu news, Tamilnadu news, Vijay Thalapathy..