Nsnnews// ఢిల్లీ: పేటీఎమ్ బ్రాండ్ యజమాని వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన వినోద టికెటింగ్ వ్యాపారాన్ని రూ.2,048 కోట్ల (244.2 మిలియన్ డాలర్ల)కు జొమాటో కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం వల్ల జొమాటోకు ఉన్న ‘గోయింగ్ అవుట్’ విభాగం బలోపేతం కానుంది. పేటీఎమ్ సంస్థ తన ప్రధాన విభాగమైన చెల్లింపులు, ఆర్థిక సేవల పంపిణీపై దృష్టి సారించడానికి వీలవుతుంది. పేటీఎమ్ వినోద టికెటింగ్ వ్యాపారంలో సినిమాలు, స్పోర్ట్స్, ఈవెంట్లు (లైవ్) ఉన్నాయి. మొత్తం నగదు రూపేణ జరిగే ఈ లావాదేవీకి జొమాటో, వన్ 97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్) బోర్డులు అనుమతి ఇచ్చాయి.
ఇలా ఒప్పందం..
- ఓసీఎల్ తన టికెటింగ్ వ్యాపారాన్ని అనుబంధ కంపెనీలైన ఆర్బ్‌జెన్ టెక్నాలజీస్, వేస్ట్‌ల్యాండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లకు బదిలీ చేస్తుంది. ఈ రెండు కంపెనీలు టికెట్‌న్యూ, ఇన్‌సైడర్ ప్లాట్‌ఫారాలను నిర్వహిస్తున్నాయి.
- ఆ తర్వాత ఈ సంస్థల్లోని 100% వాటాను జొమాటోకు విక్రయిస్తుంది.
- దీంతో జొమాటో తన కొత్త వ్యాపారాన్ని విడదీసి కొత్త యాప్ ‘డిస్ట్రిక్ట్’ను తీసుకొస్తుంది.
- ఒప్పందం కింద సినిమా టికెట్లను విక్రయించే ఆర్బ్‌జెన్ టెక్నాలజీస్‌ను రూ.1264.6 కోట్లకు, ఈవెంట్ టికెట్లను అమ్మే వేస్ట్‌ల్యాండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను రూ.783.8 కోట్లకు కొనుగోలు చేస్తుంది. ఈ రెండు వినోద టికెటింగ్ వ్యాపారాలు 2023-24లో రూ.297 కోట్ల ఆదాయంపై రూ.29 కోట్ల ఎబిటాను ఆర్జించాయి.
12 నెలల తర్వాతే: ఈ లావాదేవీ జరగబోయే 12 నెలల పాటు సినిమాలు, స్పోర్ట్స్, ఈవెంట్లకు సంబంధించిన టికెట్లు పేటీఎమ్ యాప్‌లో అందుబాటులో ఉంటాయని ఓసీఎల్ స్పష్టం చేసింది. అంటే ఆ తర్వాతే జొమాటోకు చెందిన డిస్ట్రిక్ట్ యాప్‌లో ఈ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. సినిమా టికెట్ల వ్యాపారాన్ని సొంతంగా పేటీఎమ్ ప్రారంభించగా.. ఆ తర్వాత ఇన్‌సైడర్, టికెట్‌న్యూలను 2017-18 మధ్య కొనుగోలు చేసింది.
Latest news,Telugu news,Business news,Paytm news