Nsnnews// హమాస్, హెజ్‌బొల్లాల కీలక నేతల హత్యల నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉండటంతో.. పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఈ సమయంలో కూడా గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా తూర్పు గాజాలోని ఓ పాఠశాలలో తలదాచుకుంటున్న వారిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అంతర్జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం తూర్పు గాజాలో నిరాశ్రయులు తలదాచుకుంటున్న ఓ పాఠశాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ దాడిలో దాదాపు వంద మందికి పైగా ప్రజలు మరణించగా, పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గత వారంలో గాజాలోని మూడు పాఠశాలలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇటీవల ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 30 మంది మరణించగా పలువురు గాయాలపాలయ్యారు. ఆగస్టు 1న దలాల్ అల్-ముఘ్రాబీ స్కూల్‌పై చేసిన దాడుల్లో 15 మంది మరణించారు.
అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదుల మెరుపు దాడుల నేపథ్యంలో.. అందుకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటివరకు గాజాలో 40,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఇటీవల జరిగిన హమాస్, హెజ్‌బొల్లాల కీలక నేతల హత్యల నేపథ్యంలో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. హమాస్‌ను భూస్థాపితం చేస్తామంటూ ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. వాటి ధాటికి అక్కడి భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, తాగునీటి వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 40 వేల మంది పాలస్తీనీయులు మృతి చెందినట్లు స్థానిక ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Latestnews, Telugunews, Israel, Gaza, Attack…