Nsnnews// సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ పాలకమండలి ఏర్పాటుపై సస్పెన్స్ వీడడం లేదు. మూడు నెలలుగా ఫైల్ కమిషనరేట్ లోనే పెండింగ్ ఉంది. దీంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ పాలకమండలి పదవుల కోసం ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పాలకమండలి నియామకానికి అధికారులు దరఖాస్తుల స్వీకరించారు. కానీ.. ఇంకా కమిటీని ప్రకటించలేదు. మరో రెండు నెలల్లో జాతర సమీపిస్తోంది. దీంతో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేస్తారా ? లేక పూర్తిస్థాయిలో ఏర్పాటవుతుందా ? అనే చర్చ జోరుగా సాగుతోంది. మల్లన్న స్వామి టెంపుల్ పర్మినెంట్ పాలక మండలి ఏర్పాటుకు… గత జూన్ లో అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తంగా 85 మంది దరఖాస్తు చేసుకున్నారు. వివిధవర్గాలకు చెందిన14 మందితో పాలకమండలిని ఏర్పాటు చేస్తే, ఒకరిని చైర్మన్ గా ఎన్నుకుంటారు. గత మార్చిలో నోటిఫికేషన్ ను విడుదల చేసినా.. పార్లమెంటు ఎన్నికల కోడ్ కారణంగా బ్రేక్ పడింది. ఆ తర్వాత దేవాదాయ శాఖ అధికారులు జూన్ 29వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఎన్నడు లేని విధంగా పది మంది మహిళలు అప్లై చేసుకోవడం గమనార్హం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత దశాబ్దకాలంగా ఆలయ చైర్మన్ పదవి ఎక్కువగా బీసీలకే దక్కింది. ఇక..ఆలయ పాలక మండలి ఏర్పాటు ఫైల్ దేవాదాయ శాఖ కమిషనరేట్ లో పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై పలువురు ముఖ్య నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫైల్ కదలడం లేదు. కావాలనే జాప్యం జరుగుతుందనే అనుమానాలు వస్తున్నాయి. కమిషనరేట్ నుంచి కొత్త పాలక మండలి సభ్యుల పేర్లతో ఫైల్ సచివాలయానికి వెళ్లాక.
ప్రభుత్వం పరిశీలించి ప్రకటన చేసే చాన్స్ ఉంది. కాగా ఇప్పటికే 13 మంది పేర్లు ఖరారైనా.. ఇప్పటికీ ఉత్తర్వులు వెలువడలేదు. ఇది ఇలా ఉంటే…అధికారులతో మాట్లాడినా కాలయాపన చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మరో రెండు నెలల్లో మల్లన్న జాతర ప్రారంభం కానుంది. ఏడాది కాలపరిమితి గల పాలక మండలి ఏర్పాటుపై ఇలా తీవ్ర జాప్యం కావడం ఆసక్తిని కలిగిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక నేతలు తమకు చాన్స్ వస్తుందని భావిస్తున్నారు. కమిటీ నియామకంపై సస్పెన్స్ వీడకపోవడంతో ఆశావహుల్లో నిరాశే ఎదురవుతోంది. తెలంగాణలోనే ఎంతో ప్రశస్తి కలిగిన శైవ క్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు… సిద్దిపేట జిల్లాకు చెందిన పలువురు నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నప్పుడు ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి చైర్మన్ పదవి దక్కింది. గత పదేండ్లుగా బీసీ వర్గాలకు అవకాశం లభించింది. దీంతో ఇప్పుడు కూడా డజను మంది ముఖ్య నేతలు.. చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకుని మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ముఖ్యంగా గొల్ల కుర్మల ఆరాధ్య దైవమైన మల్లన్న ఆలయ పాలక మండలిలో ఆయావర్గాలకు ప్రాధాన్యత దక్కుతుండగా… ఈసారి చాలా మంది తమకు చాన్స్ రావచ్చనే ఆశతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్య నేతల మాటే చెల్లుబాటయ్యే అవకాశం ఉండడంతో.. ఎవరికి వారు తమదైన రీతిలో చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆలయ పాలక మండలిలో వివిధ వర్గాలకు చెందిన13 మందితో పాటు… ఆలయ పూజారిని ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నియమిస్తారు. ఆలయ చైర్మన్ తో పాటు… పాలక మండలిలో స్థానం కోసం పలువురు కాంగ్రెస్ నేతలు ముమ్మర ప్రయత్నా లు కొనసాగిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్‌లతో పాటు.., ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్, జనగామ డీసీసీ అధ్యక్షు డు కొమ్మూరి ప్రతాప రెడ్డిల మద్దతుతో.. పాలక మండలిలో స్థానం సంపాదించేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు పైరవీలు చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. పాలకమండలితో పాటు చైర్మన్ పదవిని చేజిక్కంచుకో వడానికి పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి సూచిం చే వ్యక్తులకే అవకాశాలు వచ్చేలా కనిపిస్తున్నాయి.
Latestnews, Telugunews, Telangananews, Komuravelli MallikarjunaTemple…