Nsnnews// హైదరాబాద్: కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగమని.. కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందని బి.ఆర్.ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. ఒక్క ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని… ఇదే ఆగమవుతున్న తెలంగాణ రైతు బతుకుకు తొలి ప్రమాద సంకేతమని పేర్కొన్నారు. దశాబ్ద కాలంలోనే దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో 8 నెలల్లో ఎందుకింత విధ్వంసమని ప్రశ్నించారు. మొన్న వ్యవసాయానికి కరెంట్ కట్.. నిన్న రుణమాఫీలో రైతుల సంఖ్య కట్.. నేడు సాగయ్యే భూవిస్తీర్ణం కట్ అని ఎద్దేవా చేశారు.
‘‘రుణమాఫీ పేరుతో మభ్యపెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయ్ కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదు. బురద రాజకీయాలు తప్ప… కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసానే లేదు. అప్పుల బాధతో అన్నదాతలు, కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ తెలంగాణలో సాగువిస్తీర్ణం తగ్గడానికి కారణాలు’’ అని కేటీఆర్ విమర్శించారు.
Latest news,Telugu news,Politics News,Telangana News,BRS,KTR