Nsnnews// ఢిల్లీ: విమానం లోపల వైర్‌లెస్ వినోద సేవలను ప్రారంభించినట్లు ఎయిరిండియా తెలిపింది. ప్రస్తుతానికి పెద్ద (వైడ్ బాడీ) విమానాల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. కొన్ని విమానాల్లోని వినోద వ్యవస్థలు పనిచేయకపోవడం, అంతరాయం చోటు చేసుకుంటుండటం వంటి వాటిపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో, ఎయిరిండియా ఈ సేవలను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎయిరిండియా తన పాత విమానాలను నవీకరిస్తుండటంతో పాటు కొత్త విమానాలను ప్రవేశపెట్టే పనిలో ఉంది. కొత్త ఇన్‌ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సేవ ‘విస్టా’ను త్వరలో చిన్న (నారో బాడీ) విమానాల్లోనూ ప్రవేశపెట్టనుంది. అయితే కొత్తగా వచ్చిన బీ777, ఏ350 విమానాల్లో ఈ సేవ అందుబాటులో ఉండదు. ‘విస్టా’ సాయంతో ప్రయాణికులు తమ వ్యక్తిగత ఎలక్ట్రానిక్ డివైజ్‌లలోనే కంటెంట్‌ను వీక్షించడానికి వీలవుతుంది. ఇందుకు వీలుగా బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, మ్యూజిక్ హిట్స్‌తో పాటు పలు డాక్యుమెంటరీలు, ఆస్కార్ నామినేటెడ్ సినిమాలు, పిల్లల కోసం వీడియోలు.. తదితరాలతో కూడిన 950 గంటల కంటెంట్‌ను ‘విస్టా’లో జోడించింది. విమానాన్ని ట్రాక్ చేయడానికి లైవ్ మ్యాప్ డిస్‌ప్లే కూడా అందుబాటులో ఉంటుంది.
Latest news,Telugu news,Business news