Nsnnews// మ్యాడ్రిడ్: స్పెయిన్‌లో అశ్లీల చిత్రాల వీక్షణ అధికమైనట్లు ‘డేల్ ఉనా వుల్టా’ అనే స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. వీక్షించేవారిలో అత్యధికమంది మైనర్లు కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని ఎలాగైనా అడ్డుకొనే దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై ప్రధాని పెడ్రో శాంచెజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల కంటే తక్కువ వయసు వారిలో సగం మంది అశ్లీల చిత్రాలను వీక్షిస్తున్నట్లు తేలిందని తెలిపారు. దీన్ని అడ్డుకునేందుకు కొత్త ఆలోచనతో ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. ఒక యాప్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు.
ఈ యాప్‌ను ‘కార్టెరా డిజిటల్ బీటా’ అనే పేరిట తీసుకొస్తున్నారు. స్థానికంగా దీన్ని ‘పజాపోర్టే’ అని పిలుస్తున్నారు. ఇది ఒక మొబైల్ వ్యాలెట్‌గా పనిచేస్తుంది. దీన్ని ప్రభుత్వం జారీ చేసే ఐదు అధీకృత ధ్రువపత్రాల్లో ఏదో ఒక దానికి అనుసంధానించాల్సి ఉంటుంది. తద్వారా వయసు ధ్రువీకరిస్తారు. 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవారికి యాక్సెస్ లభించదు. నిర్ణీత వయసు దాటిన వారికి నెలకు 30 క్రెడిట్లు అందజేస్తారు. ఒక్కో క్రెడిట్‌కు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. వాటి ద్వారా అశ్లీల చిత్రాల వెబ్‌సైట్‌కు యాక్సెస్ లభిస్తుంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అడల్ట్ కంటెంట్ వెబ్‌సైట్లు కచ్చితంగా యూజర్ల వయసును ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. అందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌ను మాధ్యమంగా వినియోగించుకోవాలి. అయితే, ఇది ఐచ్ఛికమే. కావాలంటే వెబ్‌సైట్లు ఇతర మార్గాల ద్వారా కూడా వయసును నిర్ధరించుకోవచ్చు. మైనర్ కాదని ధ్రవీకరించడం మాత్రం తప్పనిసరి. దీన్ని కచ్చితంగా అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్‌కు అప్పగించింది. ఈ పద్ధతిని సోషల్ మీడియా సైట్లకూ విస్తరించే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ఇప్పటికే ఆయా సంస్థలతో చర్చలు ప్రారంభించింది.
దీన్ని కొన్నివర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ విధానంతో ప్రభుత్వమే అశ్లీల చిత్రాల వీక్షణకు అనుమతి ఇచ్చినట్లు అవుతుందని దుయ్యబడుతున్నాయి. స్పెయిన్ ప్రభుత్వం మాత్రం మైనర్లను రక్షించేందుకు ఇంతకంటే మెరుగైన మార్గం లేదని సమర్థించుకుంది. మరోవైపు తప్పుదోవ పట్టించే సమాచారం నుంచి పిల్లలను దూరంగా ఉంచాలనే ఐరోపా సమాఖ్య నిర్ణయానికి అనుగుణంగానే తాము కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో దీన్ని ఇతర సభ్యదేశాలు సైతం అమలు చేసే అవకాశం ఉందని తెలిపింది.
Latestnews, Telugunews, Spain cracks, pornographic content…