Nsnnews// దేశంలోని బాలికల పెళ్లి వయసు కు సంబంధించి పార్లమెంట్‌లో ఇరాక్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఓ బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమ్మాయిల వివాహ వయసును 9 సంవత్సరాలకు కుదించాలంటూ ఆ బిల్లులో ప్రతిపాదించడమే అందుకు కారణం. ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయ మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టింది. పర్సనల్ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో దీనిని తీసుకువచ్చారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఇరాక్‌లో అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. ఒకవేళ ఈ బిల్లు పాస్ అయితే బాలికలు 9 ఏళ్లు, బాలురు 15 ఏళ్లకు వివాహం చేసుకోవడానికి చట్టపరంగా ఎలాంటి అడ్డంకి ఉండదు. ఇది బాల్యవివాహాలు పెరిగేందుకు కారణమవుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. లింగ సమానత్వం, మహిళల హక్కుల విషయంలో ఇంతకాలం సాధించిన పురోగతిని దెబ్బతీస్తుందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బాలికల విద్య, ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, దీనివల్ల చదువు మధ్యలో ఆపే ఆడపిల్లల సంఖ్య పెరుగుతుందని, చిన్నవయసులోనే గర్భం దాల్చడం, గృహహింస వంటివి పెచ్చుమీరతాయని ఆగ్రహం వ్యక్తంచేశాయి. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం.. ఇరాక్‌లో ఇప్పటికే 28 శాతం మంది బాలికలకు 18 ఏళ్లలోపే పెళ్లిళ్లవుతున్నాయి. గతంలోను ఇరాక్ పార్లమెంట్ వేదికగా వివాహ వయసు కుదింపు ప్రయత్నం జరిగినప్పటికీ.. పలువురు చట్టసభ సభ్యుల అభ్యంతరంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
Latestnews, Telugunews, Legal Age Of Marriage For Girls, Iraq Government…