Nsnnews// హైదరాబాద్ : ‘హిమాయత్‌సాగర్ పూర్తి నిల్వ సామర్థ్యం పరిధిలో (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్‌లో నా ఫాంహౌస్ ఇటుక ఒక్కటి వచ్చినట్లు తేలినా మొత్తాన్ని కూల్చేయండి’ అని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బి.ఆర్.ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావులకు సవాల్ చేశారు. సామాన్యులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ‘హైడ్రా’ ఏర్పాటు చేస్తే.. తమ అక్రమ నిర్మాణాలు, కబ్జా చేసిన స్థలాలు ఎక్కడ పోతాయోననే భయంతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘మంచి ఉద్దేశంతో హైడ్రా తెచ్చాం. నీటివనరుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలకు అనుమతించేది లేదు. అలాంటి అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నాం. కాంగ్రెస్ నేత పల్లంరాజు కుటుంబ సభ్యులకు చెందిన కట్టడాన్ని కూడా హైడ్రా కూల్చేసింది. నా ఫాంహౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని కేటీఆర్, హరీశ్‌రావులు దుష్ప్రచారం చేస్తున్నారు. మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్లమని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఇక్కడి నుంచే ఆదేశిస్తున్నా. అక్రమం అని తేలితే హైడ్రా అవసరం లేదు. మీరే కూల్చేసి రండి.
రెవెన్యూ చట్టం రోల్ మోడల్ కావాలి
18 రాష్ట్రాల రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి ఆర్‌ఓఆర్-2024 చట్టం తీసుకురాబోతున్నాం. కలెక్టరేట్లలో శుక్ర, శనివారాలు దీనిపై సదస్సులు పెట్టాం. తెలంగాణ రెవెన్యూ చట్టం దేశానికి రోల్ మోడల్ కావాలి. ఈ చట్టం పరిధిలోకి కోటీ 60 లక్షల ఎకరాలు తీసుకువస్తాం. మెగా డీఎస్సీ ద్వారా 11 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం.
మీడియాకు స్వేచ్ఛ
త్వరలోనే జేఎన్‌జే సొసైటీకి 72 ఎకరాలు అందజేస్తాం. మీడియాకు స్వేచ్ఛ ఇచ్చాం. దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. బి.ఆర్.ఎస్ నిరసనలను కవర్ చేస్తున్న ఓ మహిళా జర్నలిస్టు మీద దాడి జరగడం దురదృష్టకరం. దీన్ని సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటాం’’ అని పొంగులేటి తెలిపారు.
ప్రతి రైతుకూ రుణమాఫీ అయ్యేలా చూస్తాం
ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేశాం. రూ.2 లక్షలకు పైనున్న రైతులకు ఆ బకాయిలు సర్దుబాటు చేసుకోవడానికి సమయమిస్తూ.. త్వరలోనే కటాఫ్ డేట్ ప్రకటిస్తాం. ఆ తేదీలోగా పైనున్న బకాయిలు చెల్లిస్తే వెంటనే రూ.2 లక్షలు మాఫీ అవుతుంది. రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవుతుందని అంచనా వేశాం. అంతకన్నా ఎక్కువైనా భరిస్తాం. ప్రతి రైతుకు రుణమాఫీ చేయడమే లక్ష్యం. ఇప్పటివరకు ఉచిత విద్యుత్ లబ్ధిదారులు 47 లక్షల మంది, రూ.500కే గ్యాస్ లబ్ధిదారులు 42 లక్షల మంది నమోదయ్యారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్‌కార్డుతో పాటు హెల్త్ కార్డు ఇస్తాం. నిర్మాణాలు మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేసి బహుపేదలకు అందజేస్తాం. రూ.5 లక్షల చొప్పున వ్యయంతో ప్రతి గ్రామంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం.
Latest news,Telugu news,Politics news,Telangana news